ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా హారియర్ ఈవీని బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్ అప్డేట్! టాటా మోటార్స్‌కి చెందిన ఈ సరికొత్త లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కారు ప్రొడక్షన్ మహారాష్ట్రలోని పుణె ప్లాంట్‌లో ప్రారంభమైంది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో ఈ కొత్త మోడల్ ఒక కీలకంగా నిలవనుంది. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ. 21.49 లక్షల నుంచి రూ. 30.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కొత్త హారియర్ ఈవీకి మార్కెట్ నుంచి అద్భుతమైన స్పందన లభించిందని, బుకింగ్‌లు భారీగా ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. త్వరలోనే డీలర్‌షిప్‌లకు ఈ వాహనం చేరుకుంటుందని, ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభం అవుతాయని సమాచారం!
కొత్త టాటా హారియర్ ఈవీ acti.ev+ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంది. ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వెర్షన్ ప్లాట్‌ఫారమ్‌కు ఆప్టిమైజ్ చేసిన రూపం. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రేర్-వీల్ డ్రైవ్, క్వాడ్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఆర్డబ్ల్యూడీ వెర్షన్‌లో వెనుక యాక్సిల్‌పై ఒకే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అయితే క్యూడబ్ల్యూడీ వెర్షన్‌లో మాత్రం రెండు యాక్సిల్స్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి!
టాటా హారియర్ ఈవీ ఆర్డబ్ల్యూడీ వేరియంట్‌లు 235 బీహెచ్‌పీ (బ్రేక్ హార్స్‌పవర్) పవర్‌ని, 315 ఎన్ఎమ్ (న్యూటన్ మీటర్) టార్క్‌ను ఉత్పత్తి చేసే సింగిల్ మోటార్‌తో వస్తాయి. ఇక క్యూడబ్ల్యూడీ డ్యూయల్-మోటార్ సెటప్ అయితే 391 బీహెచ్‌పీ పవర్‌ని, 504 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది.
ఈ ఎస్యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. తక్కువ వేరియంట్‌లకు 65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 538 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. హై-ఎండ్ వేరియంట్‌లకు 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో ఆర్డబ్ల్యూడీలో 627 కి.మీ, క్యూడబ్ల్యూడీలో 622 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, హారియర్ ఈవీ అనేక అధునాతన ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో డిజిటల్ కన్సోల్, హర్మాన్ నుంచి శాంసంగ్ నియో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టెమ్, పార్కింగ్ చేసేటప్పుడు బ్లైండ్-స్పాట్‌లను తగ్గించే 540-డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్ ఉన్నాయి. ఈ మోడల్‌లో డిజిటల్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ కూడా ఉంది. అంతేకాకుండా, కఠినమైన రహదారులపై వెళ్లేటప్పుడు వాహనం కింద ఉన్న ప్రాంతాన్ని చూసేందుకు వీలు కల్పించే ట్రాన్స్‌పరెంట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
హారియర్ ఎలక్ట్రిక్ కారు నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. అవి.. నైనిటాల్ నాక్టర్న్, ఎంపావర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే. ప్రారంభం నుంచే ఆల్-బ్లాక్ స్టెల్త్ ఎడిషన్ కూడా లభిస్తుంది.
సంబంధిత కథనం