Swiggy: స్విగ్గీ నుంచి కొత్తగా ‘స్నాక్’ యాప్; 15 నిమిషాల్లో డెలివరీ
Swiggy: క్విక్ డెలివరీ సెగ్మెంట్ లో పోటీ పెరుగుతోంది. గ్రోసరీలతో పాటు టీ, కాఫీ వంటి డ్రింక్స్ ను, స్నాక్స్ ను, లైట్ మీల్స్ ను కూడా అత్యంత త్వరగా అందించే యాప్స్ సంఖ్య పెరుగుతోంది. తాజాగా, త్వరితగతిన స్నాక్స్, లైట్ మీల్స్ వంటి వాటిని అందించేందుకు 'స్నాక్' అనే కొత్త యాప్ ను స్విగ్గీ లాంచ్ చేసింది.
Swiggy: కేవలం 15 నిమిషాల్లో ఫాస్ట్ స్నాక్, లైట్ మీల్ డెలివరీలను అందించేలా 'స్నాక్ బై స్విగ్గీ' పేరుతో కొత్త ఫుడ్ డెలివరీ యాప్ ను స్విగ్గీ ప్రవేశపెట్టింది. ఈ యాప్ జెప్టో కేఫ్ మాదిరిగానే త్వరగా డెలివరీ చేసే ఫుడ్ ఆప్షన్స్ పై దృష్టి పెడుతుంది. ముఖ్యంగా, స్నాక్స్, డ్రింక్స్, లైట్ మీల్స్ శ్రేణిని అందిస్తుంది.
ప్రస్తుతం బెంగళూరులో..
ప్రస్తుతం, స్నాక్ యాప్ సేవలను ఎంపిక చేసిన బెంగళూరు పిన్ కోడ్ లలో పరీక్షిస్తున్నారు. అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. టీ, కాఫీ, బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్, లైట్ మీల్స్, డెజర్ట్స్ వంటి ఫుడ్ ఆప్షన్స్ ను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఈ యాప్ ను ప్లే స్టోర్ లలో నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
సెపరేట్ యాప్ గా..
స్నాక్ ఒక స్టాండలోన్ యాప్ గా పనిచేస్తుంది. సాధారణంగా స్విగ్గీ (swiggy) తను అందించే అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా అందిస్తుంది. కానీ, మొదటి సారి ఈ స్నాక్ యాప్ ను సెపరేట్ గా స్టాండలోన్ యాప్ గా అందిస్తోంది. ఈ స్నాక్ యాప్ తో స్విగ్గీ ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో ఉన్న ఇతర సంస్థలతో పోటీ పడనుంది. ఈ యాప్ జెప్టో కేఫ్, బ్లింకిట్ బిస్ట్రో లతో ప్రధానంగా పోటీ పడుతుంది. బ్లింకిట్ బిస్ట్రో కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ఇటీవల జొమాటో తన ప్రధాన యాప్ లో ఇలాంటి 15 నిమిషాల ఫుడ్ డెలివరీ సేవను ప్రారంభించింది. దీనిద్వారా జొమాటో (zomato) సర్వీస్ 2 కిలోమీటర్ల పరిధిలో సమీపంలోని రెస్టారెంట్ల నుండి రెడీ టు ఈట్ భోజనం, స్నాక్స్ ను డెలివరీ చేస్తుంది.
స్విగ్గీ బోల్ట్ కు స్విగ్గీ స్నాక్ కు తేడా ఏంటి?
స్పీడ్ ఫుడ్ డెలివరీ కోసం ఇప్పటికే స్విగ్గీలో బోల్ట్ ఆప్షన్ ఉంది. ఇది సమీప రెస్టారెంట్ల నుండి 10 నిమిషాల డెలివరీలను అందించే లక్ష్యంతో ఏర్పడింది. కానీ, స్విగ్గీ స్నాక్ మాత్రం స్నాక్ ఫాస్ట్ ఫుడ్, పానీయాలు, రెడీ ఫుడ్ ను డెలివరీ చేయడంపై దృష్టి పెట్టింది. దీని మెనూలో చాక్లెట్ కుకీలు, కాఫీ, శాండ్ విచ్ లు, ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్, ఎగ్ పఫ్స్, చీజ్ మ్యాగీ ఉన్నాయి. ఇప్పటికే 400కు పైగా నగరాలకు సేవలందిస్తున్న, స్విగ్గీ ఆర్డర్లకు గణనీయంగా దోహదపడే బోల్ట్ కంటే భిన్నమైన మార్కెట్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని స్నాక్ రూపొందించబడింది.
ఓలా కూడా..
స్పీడ్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ లోకి ఓలా (ola) కూడా ప్రవేశించింది. ఓలా డాష్ పేరుతో ఇది ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం బెంగళూరు (bengaluru news) లో 10 నిమిషాల ఫుడ్ డెలివరీని అందిస్తుంది. దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, మ్యాజిక్ ఫిన్ ఆరు భారతీయ నగరాల్లో 15 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్ మ్యాజిక్ నౌను ప్రారంభించింది.