Suzuki eWX EV: 230 కిమీల రేంజ్ తో, వేగన్ ఆర్ లుక్ తో సుజుకీ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ కార్
Suzuki eWX EV: జపాన్ కు చెందిన సుజుకి సంస్థ తమ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును టోక్యోలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో లో ఆవిష్కరించింది.
Suzuki eWX EV: జపాన్ మొబిలిటీ షో 2023లో సుజుకి తన కొత్త ఈడబ్ల్యూఎక్స్ (eWX) కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఈడబ్ల్యూఎక్స్ (eWX) కాన్సెప్ట్ అనేది ప్రజల దైనందిన జీవితాలకు దగ్గరగా ఉండే మినీ వ్యాగన్ ఎలక్ట్రిక్ వాహనమని సుజుకీ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి, సుజుకి ఈడబ్ల్యూఎక్స్ (eWX) యొక్క డైమెన్షన్స్ ను, డ్రైవింగ్ పరిధిని మాత్రమే వెల్లడించింది. ఈ వాహనాన్ని మాత్రమే కాకుండా ఈ షోలో సుజుకీ న్యూ జనరేషన్ స్విఫ్ట్ కారును కూడా ఆవిష్కరించింది.
230 కిమీల రేంజ్
సుజుకీ ఈడబ్ల్యూఎక్స్ (eWX) ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు పొడవు 3,395 ఎంఎం, వెడల్పు 1,475 ఎంఎం, పొడవు 1,620 ఎంఎం. “ఈ కారు సుజుకీ నుంచి వస్తున్న ఆచరణాత్మకమైన మినీ వ్యాగన్, ఫ్యూచరిస్టిక్ EV యొక్క క్రాస్‌ఓవర్. ఇందులో సౌకర్యవంతమైన క్యాబిన్ స్పేస్ ఉంటుంది’’ అని సుజుకీ వెల్లడించింది. ఈ కారు మారుతి సుజుకీ నుంచి వచ్చిన ఎస్ - ప్రెస్సో (S-Presso) కన్నా తక్కువ పొడవు ఉంటుంది. జపాన్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు కీ (Kei) కి పోటీగా ఈ కారును సుజుకీ రూపొందించింది. ఈ కారు లుక్స్ లో కొంతవరకు సుజుకీ వేగన్ ఆర్ తరహాలో ఉంటుంది.
డిజైన్..
ఆటో ఎక్స్ పోలో చూపిన ఈ కారు ముదురు మరియు లేత బూడిద రంగు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో ఉంది. ఫ్రంట్ బంపర్, అల్లాయ్ వీల్స్ మరియు విండో ఫ్రేమ్‌లపై నియాన్ గ్రీన్ యాక్సెంట్‌లు ఉన్నాయి. ముందు భాగంలో సి-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ తో పాటు సుజుకి లోగో కూడా ఉంది.