Stock Market : స్త్రీ 2 సినిమా భారీ వసూళ్లతో ఈ స్టాక్ సూపర్ హిట్.. నాలుగు రోజుల్లోనే!
PVR Inox Share : పీవీఆర్ ఐనాక్స్ షేర్లు ఫోకస్‌లో ఉన్నాయి. గత నాలుగు రోజులుగా కంపెనీ షేర్లు నిలకడగా పెరుగుతున్నాయి. అయితే స్త్రీ 2 సినిమా భారీ విజయంతో ఈ షేర్ ధర పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
పీవీఆర్ ఐనాక్స్ షేర్లు మంచి ప్రదర్శన ఇస్తున్నాయి. నాలుగు రోజులుగా కంపెనీ షేర్లు నిలకడగా పెరుగుతున్నాయి. బుధవారం ఇంట్రాడేలో కంపెనీ షేరు 2 శాతం పెరిగి రూ.1529కి చేరుకుంది. మంగళవారం ఈ స్టాక్ 4 శాతం లాభపడింది. బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన స్త్రీ 2 చిత్రం ఘన విజయం సాధించడం ఈ షేర్ పెరుగుదలకు కారణమైందని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ 2 సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. స్త్రీ 2 విడుదలైన వారం రోజుల్లోనే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది.
బ్రోకరేజీ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదటి త్రైమాసికంలో బలహీనమైన పనితీరు ఉన్నప్పటికీ పీవీఆర్ ఐనాక్స్ పై సానుకూల దృక్పథాన్ని కొనసాగించింది. షేరు టార్గెట్ ధరను రూ.1,709గా ఉంచింది. బలమైన కంటెంట్ ప్లాన్ మద్దతుతో ఈ స్టాక్ ధరకు డిమాండ్ కనిపిస్తోంది.
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ ప్రస్తుతం విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తిరిగి విడుదల చేసే వ్యూహంపై దృష్టి సారించింది. రీసెంట్‌గా సాజిద్ అలీ తెరకెక్కించిన లైలా మజ్ను సినిమా రీరిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను బద్దలు కొట్టింది. ఇంతకుముందు ఇంతియాజ్ అలీ నటించిన జబ్ వి మెట్, రాక్‌స్టార్ వంటి సినిమాలు కూడా ఇలాంటి రీరిలీజ్ అయ్యాయి. పీవీఆర్ ఐనాక్స్ స్టాక్‌పై ఐసీఐసీఐ డైరెక్ట్‌కు 'బై' రేటింగ్ ఉంది. స్త్రీ 2 బలమైన ప్రారంభం బలమైన రికవరీని సూచిస్తుందని, తద్వారా పెట్టుబడిదారులు ప్రయోజనం పొందవచ్చని ఓ బ్రోకరేజీ సంస్థ పేర్కొంది.
2018లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం 'స్త్రీ'కి సీక్వెల్ గా 'స్త్రీ 2' తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అపర్శక్తి ఖురానా, తమన్నా భాటియా, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్త్రీ 2'. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2 చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. Secnalic.com నివేదిక ప్రకారం స్త్రీ 2.. 250 కోట్ల క్లబ్ లో చేరింది. త్వరలోనే స్త్రీ 300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
గమనిక : ఇది కేవలం స్టాక్ పనితీరు గురించి మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.