Budget and Stocks : బడ్జెట్‌కు ముందు ఈ స్టాక్స్ మీద ఓ కన్నేసి ఉంచండి.. బెటర్!
Stock Market : బడ్జెట్ దగ్గరకి వచ్చేస్తుంది. ఈ సమయంలో కొన్ని స్టాక్స్ పుంజుకునే అవకాశం ఉంది. బడ్జెట్‌లో కేటాయింపులతో లాభాల్లోకి వెళ్లవచ్చు. ( గమనిక : ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.. నిపుణుల సలహాతోనే పెట్టుబడి పెట్టండి.)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23 మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, డిఫెన్స్ ఆధునీకరణ, గ్రామీణాభివృద్ధి, హెల్త్‌కేర్, టాక్సేషన్ వంటి కీలక రంగాలలో ప్రధాన ప్రకటనలు ఉంటాయని అంచనా. నిపుణుల ప్రకారం.. బడ్జెట్ కేటాయింపుల సందర్భంగా కొన్ని స్టాక్స్ లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మీరు కొనాలి అనుకుంటే నిపుణుల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టవచ్చు. ఏయే రంగాల్లో ఏయే స్టాక్‌లు పురోగతి సాధించే అవకాశం ఉందో తెలుసుకుందాం..

మౌలిక సదుపాయాలు
రోడ్లు, విద్యుత్తు, పట్టణాభివృద్ధి, రైల్వేలకు అధిక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. వృద్ధిని వేగవంతం చేయడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. వీటిలో కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. దీంతో లార్సెన్ అండ్ టూబ్రో (Lఅండ్T), KNR కన్స్ట్రక్షన్స్, PNC ఇన్ఫ్రాటెక్‌లాంటి స్టాక్స్ పెరగవచ్చు.
రైల్వేకు కేటాయింపులు
కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల పునరాభివృద్ధి, ఆధునీకరణతో సహా రైల్వే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఆధునీకరించడంలో బడ్జెట్‌లో గణనీయమైన కేటాయింపులు ఆశించవచ్చు. IRCTC, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టిటాగర్ వ్యాగన్, RVNLలాంటి షేర్లపై ఓ కన్నేసి ఉంచాలి.
నిర్మాణ రంగం
అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు అందించాలన్న ప్రభుత్వ పథకంతొ చాలా మందికి లబ్ధి చేకూరుతుంది. అందువల్ల ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సరసమైన గృహాలను అందించడం లక్ష్యంగా మెట్రో నగరాల సమీపంలో కొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధిని ఆశించవచ్చు. DLF లిమిటెడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీలాంటి స్టాక్స్ ను చూస్తూ ఉండండి.
ఎనర్జీ ప్రాజెక్టులు
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లకు ప్రోత్సాహకాల మద్దతను బడ్జెట్‌లో ఆశించవచ్చు. అయితే ఐనాక్స్ విండ్ లిమిటెడ్, సుస్లాన్ ఎనర్జీ లిమిటెడ్‌లాంటి స్టాక్స్‌ను మీరు పరిశీలిస్తూ ఉండాలి.
ఎంఎస్ఎంఈ
ఎంఎస్ఎంఈ ద్వారా ముద్ర రుణాలు, స్టార్టప్ ఇండియా, సీడ్ ఫండ్ స్కీమ్ వంటి క్రెడిట్ పథకాల అభివృద్ధితో సహా ప్రభుత్వ పథకాల నుండి ఈ రంగం ప్రయోజనం పొందవచ్చు. HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ స్టాక్స్‌ను చూస్తూ ఉండండి.
రక్షణ రంగం
రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. సాయుధ దళాల ఆధునీకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల సముపార్జన, స్వదేశీ ప్రయత్నాలకు మద్దతుగా బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL)లాంటి స్టాక్స్ మీకు ఉపయోగపడవచ్చు.
ఆరోగ్య రంగం
ఆయుష్మాన్ భారత్ పథకం అభివృద్ధి, మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య సేవల మెరుగుదలకు సంబంధించిన ప్రకటనలు ఉంటాయి. అలాంటప్పుడు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లాలాంటి స్టాక్స్ మీరు పరిశీలించవచ్చు.
గమనిక : ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయండి.