Stock Market Cyber Crime : స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫేక్ యాప్స్‌తో 2200 కోట్ల స్కామ్.. జాగ్రత్త
Stock Market Cyber Crime : టెక్నాలజీ పెరగడంతో మోసాలు కూడా పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టండి అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మి ఇన్వెస్ట్ చేస్తే ముంచేస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో ఇన్వెస్టర్లను మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఈ సైబర్ స్కామ్‌లో ప్రమేయం ఉన్న నలుగురిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతామనే సాకుతో నకిలీ యాప్‌ల ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. ఈడీ నివేదిక ప్రకారం నిందితులను గుర్తించి కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేశారు. కంపెనీలు, బ్యాంకు ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ మోసానికి గురైన బాధితులు ఫేక్ యాప్‌ల సాయం తీసుకునేవారు. ముందుగా ఫేస్‌బుక్, యూట్యూబ్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు వినియోగదారు స్క్రీన్‌పై షేర్ మార్కెట్ పెట్టుబడి లింక్‌పై క్లిక్ చేసే ఎంపిక కనిపించింది. అది ప్రెస్ చేశారు. ఆ తర్వాత బాధితులను ICICI IR టీమ్ (57) అనే వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేశారు. గ్రూపులో కొన్ని నెలల పాటు లాభాలు లాభాలు వస్తున్నట్టుగా కొత్తమందితో చాటింగ్ చేశారు. స్కామర్లకు తెలిసిన వ్యక్తులతో ఇలా చాటింగ్ జరిగేది.
ఈ పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందాలనే దురాశతో బాధితులు సైబర్ నేరగాళ్ల బుట్టలో పడిపోయారు. తర్వాత వారితో IC ORGAN MAX అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని చెప్పారు. దాని ద్వారా ఓ బాధితుడు రూ.61 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆపై Techstars.shop అనే మరొక యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని అడిగారు. ఇలా చాలా మంది మోసానికి గురయ్యారు.
తాజాగా అలాంటి ఇన్వెస్టర్లు రూ.2200 కోట్ల మేర మోసపోయారని తెలిసింది. మోసానికి పాల్పడిన వ్యక్తి ఖరీదైన విదేశీ కార్లతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారానే ఇదంతా సాధ్యమైందని నమ్మించాడు. అలా చాలా మంది నుంచి డబ్బును వసూలు చేశాడు. తర్వాత చేతులెత్తేశాడు.
ఈజీ మనీ మోసపూరితమైనవని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్టాక్ బ్రోకింగ్‌లో చేరడానికి పూర్తి ప్రక్రియ ఉంది. డీమ్యాట్ ఖాతా తెరవడం వంటివి ఫాలో కావాలి. మీరు ట్రేడింగ్ చేసే యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. మిమ్మల్ని అధిక రాబడి వస్తుందని ఆకర్శించే యాప్‌లలో పెట్టుబడి పెట్టకూడదు. ఎందుకంటే వారు ప్రారంభంలో మీకు డబ్బులు వస్తాయని ఎర వేస్తారు. తర్వాత మీ డబ్బును లాగేస్తారు.
ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు యాప్ సురక్షితంగా ఉందా లేదా అని చూడాలి. విశ్వసనీయతను కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఆ యాప్ మీ నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే అది పెట్టుబడితో సంబంధం లేనిది. దానిలో కూడా పెట్టుబడి పెట్టకుండా ఉండండి. స్టాక్ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.