Smartwatch For Quit Smoking : సిగరేట్ అలవాటును వదిలించుకోవడానికి స్మార్ట్‌వాచ్ సాయపడుతుంది!
Smartwatch For Quit Smoking : టెక్నాలజీ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ధూమపాన వ్యసనాన్ని వదిలించుకోవడానికి సాంకేతికత ఇప్పుడు మీకు సాయపడుతుంది. అది కూడా స్మార్ట్‌వాచ్ యాప్‌తో. ఎలాగో ఇక్కడ చూద్దాం..
ఇటీవలి కాలంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో ప్రపంచమే మారింది. అదే సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల గ్యాడ్జెట్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అందులో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. వీటిలో స్మార్ట్‌వాచ్ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా సాయపడుతుంది. రోజుకు ఎంత నడవాలి? హార్ట్ బీట్ ఎంతలాంటి వివరాలను స్మార్ట్‌వాచ్‌లు అందిస్తున్నాయి.
అయితే వాచ్ కూడా కొన్ని చెడు అలవాట్లను వదిలివేయడంలో సహాయపడుతుంది. ధూమపాన వ్యసనం నుండి మిమ్మల్ని విముక్తి చేసే అద్భుతమైన యాప్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దీనికి స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. సాధారణంగా ధూమపానంతో సంబంధం ఉన్న కదలికలను గుర్తించేందుకు స్మార్ట్‌వాచ్‌లోని మోషన్ సెన్సార్‌లను ఉపయోగించే అనుకూల యాప్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాప్ డ్రాగ్‌ల సంఖ్యను, అలాగే కాల్చిన సిగరెట్‌ల సంఖ్యను ట్రాక్ చేయగలదు. స్మార్ట్‌వాచ్ స్క్రీన్ మీద ఇది చూపిస్తుంది. ఎవరైనా సిగరెట్‌ను పట్టుకున్నప్పుడు చేతి కదలికలను గుర్తించగల మోషన్ సెన్సార్ సాఫ్ట్‌వేర్ ఇందులో ఉంటుంది.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సిగరెట్ తాగే అలవాటును వదిలించుకోవడానికి సహాయపడే ఈ స్మార్ట్‌వాచ్ యాప్‌ను రూపొందించారు. యాప్ ఎలా సాయపడుతుంది? అని చాలా మంది తమ మనస్సులో ఈ ప్రశ్నను వేసుకుంటారు. ఇందులో ఏ టెక్నాలజీ ఉపయోగించారు? అని అనుమానం వస్తుంది.
మార్కెట్లోకి వస్తున్న చాలా స్మార్ట్‌వాచ్‌లు యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్‌తో అమర్చబడి ఉన్నాయి. స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన యాప్ కేవలం ఈ సెన్సార్‌ని ఉపయోగించి మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది. విశేషమేమిటంటే సిగరెట్ పట్టుకోవడం వంటి చర్యలను సెన్సార్ నిమిషాల వ్యవధిలో గుర్తించగలదు. మీ చేతి కదలికలు దానికి అర్థమవుతాయి. ఒక వ్యక్తి సిగరెట్ తాగడానికి ప్రయత్నించినప్పుడు స్మార్ట్ వాచ్ అతనికి వెంటనే హెచ్చరికను పంపుతుంది. స్క్రీన్‌పై వైబ్రేషన్, హెచ్చరిక సందేశం వస్తుంది.
ఉదాహరణకు మీరు ఈ రోజు పొగ తాగలేదు.. మీరు అద్భుతంగా చేస్తున్నారు అని మిమ్మల్ని ఉత్సహపరుస్తుంది. మీరు ధూమపానం మానేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారో గుర్తుంచుకోండి అని కూడా టెక్ట్స్ పడుతుంది. ఈ సందేశాలు మీరు ధూమపానం మానేయాలని కోరికను గుర్తు చేస్తాయి.
JMIR ఫార్మేటివ్ రీసెర్చ్‌లో ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ సాంకేతికతను పరీక్షించడానికి 18 మందిని ఎంపిక చేశారు. పాల్గొనేవారు రెండు వారాల పాటు స్మార్ట్ వాచ్‌ని ఉపయోగించారు. ఇందులో శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన యాప్ కూడా ఉంటుంది. ఇందులో సిగరెట్ తాగడానికి ప్రయత్నించిన ప్రతిసారీ రియల్ టైమ్ అలర్ట్ వచ్చింది. అలవాటును నియంత్రించడం కోసం ప్రత్యేకమైన మెసేజులు వచ్చాయి.