Best cars in 2024 : ఈ ఏడాది ఇండియాలో లాంచ్ అయిన 5 బెస్ట్ కార్లు ఇవే..
Best cars in 2024 : ఇండియాలో ఈ ఏడాది కొత్త, ఫేస్‌లిఫ్ట్ కార్లు సందడి చేశాయి. వీటిల్లో 5 మాత్రం కస్టమర్స్‌ని విపరీతంగా ఆకర్షించాయి. వీటిల్లో కొన్ని ఈవీలు, ఇంకొన్ని ఐసీఈ ఇంజిన్ కార్లు ఉన్నాయి. ఈ వాహనాల వివరాలను ఇక్కడ చూసేయండి..
2024 ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కొత్త, అప్డేటెడ్ వర్షెన్లు కస్టమర్స్‌ని పలకరించాయి. అయితే వీటిల్లో 5 మాత్రం స్టాండౌట్‌గా నిలిచాయి! ప్రజలు వీటిపై చాలా ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో 2024లో టాప్ 5 కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
స్కోడా కైలాక్ ఎస్యూవీ..
ఇండియాలో ఈ ఏడాది లాంచ్ అయిన బెస్ట్ కార్లల్లో స్కోడా కైలాక్ ఎస్యూవీ ఒకటి. ఈ కైలాక్‌తో స్కోడా మరోసారి మార్కెట్లో మెరుపులు మెరిపించింది.
కైలాక్ ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.14.40 లక్షల మధ్యలో ఉన్నాయి (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) ఇది కేవలం ఒక టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 114 బీహెచ్పీ పవర్, 178 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఎస్యూవీ డెలివరీలు 2025 జనవరిలో ప్రారంభమవుతాయి.
మహీంద్రా బీఈ6..
బీఈ6, ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఈ ఏడాది లాంచ్ చేసింది. ఇవి సరికొత్త ఐఎన్జీఎల్ఓ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నాయి. ఏదేమైనా, బీఈ6 దాని రాడికల్ డిజైన్ కారణంగా భారత మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించింది.
మహీంద్రా బీఈ6 బేస్ వేరియంట్ ధర రూ.18.90 లక్షలుగా ఉంది. ఇది 59 కిలోవాట్, 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. కేవలం 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ అవుతుందట. మహీంద్రా బీఈ6 దాని 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో 535 కిలోమీటర్ల రేంజ్‌ని, 79 కిలోవాట్ల యూనిట్ 682 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది.
టాటా కర్వ్ ఈవీ..
స్వదేశీ తయారీదారు టాటా మోటార్స్‌కి కర్వ్ ఈవీ ఈ ఏడాది అతిపెద్ద లాంచ్. కర్వ్ ఈవీ అతిపెద్ద హైలైట్ దాని కూపే ఎస్యూవీ డిజైన్! ఇది 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 55 కిలోవాట్ల యూనిట్‌తో లభిస్తుంది. దీని అర్థం కర్వ్ ఈవీ డ్రైవింగ్ రేంజ్ దాని ప్రస్తుత ప్రత్యర్థుల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.
కర్వ్ ధర రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్యలో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఇది క్రియేటివ్, ఎఫిషియెంట్, ఎంపవర్డ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
మహీంద్రా థార్ రాక్స్..
భారతీయులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన లాంచ్‌లలో మహీంద్రా థార్ రాక్స్ ఒకటి. థార్ 3-డోర్ మార్కెట్లో విజయవంతమైంది. కానీ ప్రజలు ఇంకా కొంచెం ఎక్కువ స్పేస్‌ని కోరుకున్నారు, ఎందుకంటే 3-డోర్ల వేరియంట్ నిజంగా కుటుంబాలకు ప్రాధమిక వాహనంగా ఉపయోగపడదు.
మహీంద్రా లైనప్‌లో థార్ రాక్స్ సరిగ్గా సరిపోతుంది. ఇది లాడెన్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా తయారైంది. రేర్ వీల్ డ్రైవ్‌ను ప్రామాణికంగా అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ టాప్-ఎండ్ వేరియంట్లు 4x4 తో వస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ..
జెఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియాకు అతిపెద్ద లాంచ్ ఈ విండ్సర్ ఈవి. వాస్తవానికి డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇది అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ వాహనంగా గుర్తింపు తెచ్చుకుంది. విండ్సర్ ఈవీతో, బ్రాండ్ బ్యాటరీ సబ్స్క్రిప్షన్ స్కీమ్‌ని కూడా ప్రవేశపెట్టింది.
ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ.13.50 లక్షల నుంచి రూ.15.50 లక్షల మధ్యలో ఉంది. బీఏఎస్తో వీటి ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.11.99 లక్షల మధ్యలో ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.
ఇందులో 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 332 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. డీసీ ఛార్జింగ్ ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను గంటలోపు ఛార్జ్ చేయవచ్చని సంస్థ చెబుతోంది.
సంబంధిత కథనం