Simpl layoffs: ఫిన్ టెక్ కంపెనీ ‘సింప్ల్’ లో 25% ఉద్యోగులకు ఉద్వాసన; ఉద్యోగులకు సీఈఓ క్షమాపణలు
Simpl layoffs: మేజర్ టెక్నాలజీ సంస్థలు సహా అనేక కంపెనీలు వివిధ కారణాలతో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. 2024 లో ఏర్పడిన మాంద్యం పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫిన్ టెక్ కంపెనీ సింప్ల్ తమ ఉద్యోగుల్లో 25% మందికి లే ఆఫ్ ప్రకటించింది.
Simpl layoffs: ఫిన్ టెక్ కంపెనీ సింప్ల్ (Simpl) లేటెస్ట్ గా వివిధ విభాగాలలో దాదాపు 160-170 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. నిర్వహణ ఖర్చు పెరగడం, ఆదాయం తగ్గడం, కస్టమర్ల నుంచి ఆశించిన స్పందన లభించకపోవడం.. తదితర కారణాలతో ఈ లే ఆఫ్స్ ను సింప్ల్ ప్రకటించింది. ముఖ్యంగా అధిక వేతనాలు ఉన్న విభాగాల్లో ఈ లే ఆఫ్స్ ను చేపట్టారు.
25 శాతం ఉద్యోగాల కోత
సింప్ల్ సంస్థలో గతంలో సుమారు 650 మందికి ఉద్యోగులున్నారు. గత కొన్ని నెలలుగా కోర్ ఆపరేషన్స్, ఇంటర్న్స్, కాల్ సెంటర్ ఏజెంట్స్, డీ2సీ చెక్అవుట్ వర్టికల్ ఉద్యోగులను తొలగించడంతో ఉద్యోగుల సంఖ్య దాదాపు 25 శాతం తగ్గింది. 2023 మార్చిలో కూడా కంపెనీ కొంతమంది ఉద్యోగులను తొలగించింది. ఆ తరువాత, కొంతమంది కొత్త సిబ్బందిని నియమించుకుంది.
సీఈఓ క్షమాపణలు
సింప్ల్ (Simpl) సంస్థ మే 8న టౌన్ హాల్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ మీటింగ్ లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ నిత్యానంద్ శర్మ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను వదిలేయాల్సి వస్తోందని ఆయన ఆ మీటింగ్ లో చెప్పారు. లే ఆఫ్ పొందిన ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ, ఔట్ ప్లేస్ మెంట్ వంటి విషయాల్లో తమ వంతు సాయం చేస్తామన్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని వెల్లడించారు. ‘‘ఈ ప్రక్రియ ద్వారా, సింప్ల్ (Simpl) కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, స్థిర, ఓవర్ హెడ్ ఖర్చులను తగ్గించడంతో పాటు పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది’’ అని వివరించారు.
నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యం
‘‘మా వ్యాపారులకు, దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది వినియోగదారులకు భాగస్వామ్య విలువను సృష్టించడానికి కట్టుబడి ఉన్న సంస్థగా, మేము నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, స్థిర, ఓవర్ హెడ్ ఖర్చులను తగ్గించడానికి అనేక చర్యలను చేపట్టాము. అందులో భాగంగా మా ప్రతిభావంతులైన కొంతమంది ఉద్యోగులను విడిచిపెట్టే కఠినమైన నిర్ణయం తీసుకున్నాము. లాభదాయకత వైపు మా ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, ఆర్థికంగా వివేకవంతమైన సంస్థను నిర్మించడానికి ఈ లే ఆఫ్స్ నిర్ణయం తప్పనిసరి అయింది.. ఈ-కామర్స్ మరియు డైరెక్ట్-టు-కస్టమర్ వ్యాపారులు తమ వినియోగదారులకు మెరుగైన సౌలభ్యాన్ని అందించడానికి వీలు కల్పించే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లాభదాయకతపై పదునైన దృష్టిని కలిగిస్తూ మేము సమగ్ర వృద్ధి ప్రణాళికను రూపొందించాము’’ అని సింప్ల్ (Simpl) సీఈఓ నిత్యానంద్ శర్మ వివరించారు.