Silver as an Investment: విలువైన లోహాల్లో వెండి (Silver) ఒకటి. ఆభరణాలతో పాటు పలు ఇతర అవసరాలకు కూడా వెండిని ఉపయోగిస్తారు. మరో విలువైన లోహమైన బంగారంతో పోలిస్తే, వెండి ధర చాలా తక్కువ. కేజీ వెండి ధర, 10 గ్రాముల బంగారంతో దాదాపు సమానంగా ఉంటుంది. ఇప్పుడు కేజీ వెండి ధర రూ. 73,600 గా ఉంది.
బంగారంతో పోలిస్తే, వెండి డిమాండ్ ఎక్కువ. అందుకు కారణం వెండిని కేవలం ఆభరణాల తయారీ కే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు కోసం కూడా వినియోగించడమే. వెండి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దాని లభ్యత క్రమంగా తగ్గుతోంది. ఇప్పుడు వెండిపై పెట్టుబడి పెడితే, సమీప భవిష్యత్తులోనే ఆ పెట్టుబడిపై మంచి లాభాలను ఆర్జించవచ్చు. భారత్ లో వెండి ధర, బంగారం ధరతో సంబంధం కలిగి ఉంటుంది. బంగారం ధర పెరిగితే, వెండి ధర కూడా పెరుగుతుంది. కొనుగోళ్లు పెరినప్పుడు కూడా వెండి ధర పెరుగుతూ ఉంటుంది.
వెండిని ఆభరణాల రూపంలోనే కాకుండా ఇప్పుడు డిజిటల్ రూపంలో కూడా కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ లు, ఇతర ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ వెండిని ఆన్ లైన్ లో అమ్ముతున్నాయి. ఫైన్ సిల్వర్ స్వచ్ఛత ప్రమాణం 999.9 లేదా 999.5 లేదా 999 గా ఉంటుంది. సాధారణంగా వెండి ఆభరణాలు లేదా మిశ్రమ లోహంగా ఉన్నప్పుడు వెండి స్వచ్ఛత 970 లేదా 925 లేదా 900 లేదా 835 గా ఉంటుంది. వెండిని పూర్తి స్వచ్ఛతతో ఉపయోగించలేము. అందువల్ల ఆభరణాల వ్యాపారులు స్టెర్లింగ్ సిల్వర్ ను వెండి ఆభరణాల తయారీకి వాడుతారు. ఇందులో 92.5% వెండి, 7.5% ఇతర లోహం ఉంటుంది.
వెండిని పెట్టుబడిగా పెట్టడంలో చాలా లాభాలున్నాయి. వెండిని భారత ఆభరణాల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. డిమాండ్ పెరుగుతుండడం, లభ్యత తగ్గుతుండడం వల్ల సమీప భవిష్యత్తులో వెండి ధర గణనీయంగా పెరిగే అవకాశముంది. అలాగే, వెండి బంగారం కన్నా తక్కువ ధరలో లభిస్తుంది. కనుక సాధ్యమైన ప్రతీసారి చిన్న మొత్తాల్లో అయినా, కొనుగోలు చేసి పెట్టుకోవచ్చు.
భారత్ లో వెండి ఉత్పత్తి చాలా తక్కువ. అందువల్ల ఎక్కువ శాతం వెండిని దిగుమతి చేసుకుంటుంది. భారత్ లో గుజరాత్, జార్ఖండ్, రాజస్తాన్ ల్లో వెండి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. భారత్ లో ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 10%గా ఉంది. ప్రధానంగా చైనా, బ్రిటన్, యూరోప్ దేశాలు, ఆస్ట్రేలియా, దుబాయిల నుంచి భారత్ వెండిని దిగుమతి చేసుకుంటుంది.