అధిక వడ్డీ రేట్లకు Personal loan తీసుకోవడం మంచిదేనా?-should you opt for a personal loan offered at a high interest rate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అధిక వడ్డీ రేట్లకు Personal Loan తీసుకోవడం మంచిదేనా?

అధిక వడ్డీ రేట్లకు Personal loan తీసుకోవడం మంచిదేనా?

Sharath Chitturi HT Telugu

అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వస్తే... ఏ సందర్భాల్లో తీసుకోవచ్చు? అసలు అధిక వడ్డీ రేట్లు ఎప్పుడు ఉంటాయి? మీరు తెలిసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన వివరాలను ఇక్కడ చూసేయండి..

పర్సనల్​ లోన్​ టిప్స్​..

మీకు డబ్బు అవసరమైనప్పుడు, మీరు అప్పు ఇచ్చే సంస్థను (బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫిన్‌టెక్ సంస్థ) ఆశ్రయించవచ్చు. మీరు అప్పుగా తీసుకునే డబ్బుపై వడ్డీ రేటు అనేది మీ క్రెడిట్ స్కోరు, ఆదాయ స్థాయి ఆధారంగా తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు.

మీరు ఎంత మొత్తం అప్పుగా తీసుకోవాలనేది మీ అవసరాన్ని బట్టి ఉంటుంది కానీ పర్సనల్ లోన్​పై విధించే వడ్డీ రేటు మాత్రం అదనపు భారం. ఈ రుణాలకు ఎలాంటి హామీ ఉండదు కాబట్టి, సాధారణంగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా (11-24 శాతం) ఉంటాయి. అయితే, పర్సనల్ లోన్‌కు ఎంత వడ్డీ రేటు ఉంటే అది మరీ ఎక్కువ అని పరిగణించవచ్చు? మీరు రుణం ఒప్పందంపై సంతకం చేసే ముందు, ఈ ముఖ్యమైన అంశాలను తప్పకుండా గమనించండి..

అధిక వడ్డీ రేటును ఎలా గుర్తించాలి?

I. ఈఎంఐ:

ముందుగా, మీ నెలవారీ పర్సనల్​ లోన్​ ఈఎంఐ (వడ్డీ, అసలు కలిపి) మొత్తం మీ నెలవారీ ఆదాయంలో సగం కంటే తక్కువగా ఉండటం చాలా ముఖ్యం! అది దాటితే భవిష్యత్తులో ఈఎంఐ చెల్లించడం కష్టమవుతుంది.

II. ఇతర ఆప్షన్లు:

ఒక అప్పు ఇచ్చే సంస్థ నిర్దిష్ట వడ్డీ రేటుకు రుణం ఇవ్వడానికి ఆఫర్ చేసినప్పుడు, మీకు ఆ వడ్డీ రేటు ఎక్కువగా అనిపిస్తే, మీరు దానిని ఇతర సంస్థల ఆఫర్లతో పోల్చి చూడవచ్చు. మరొక లెండర్ మీకు బహుశా మెరుగైన ఒప్పందాన్ని అందించవచ్చు.

III. క్రెడిట్ స్కోరు:

మీరు పరిగణించాల్సిన మరో ముఖ్యమైన అంశం.. మీ క్రెడిట్ స్కోరు. సాధారణంగా, మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నప్పుడే మీ పర్సనల్​ లోన్​ వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. ఒకవేళ మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే, మరింత మెరుగైన ఆఫర్ కోసం మీరు ఇతర పర్సనల్ లోన్ ఆప్షన్లను అన్వేషించవచ్చు.

ఈ సందర్భాల్లో అధిక వడ్డీకి పర్సనల్​ లోన్​ తీసుకోవచ్చు..

అయితే.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం సబబే. ఎప్పుడెప్పుడంటే..

1. అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు:

డబ్బు అవసరం చాలా అత్యవసరంగా ఉండి, ఎవరిదైనా ప్రాణాన్ని కాపాడటం లేదా మీ వ్యాపారాన్ని రక్షించుకునేందుకు అధిక వడ్డీకి లోన్​ తీసుకోవచ్చు. ఈ సందర్భాల్లో వడ్డీని ఆదా చేయడం కంటే పరిస్థితులు మరింత ముఖ్యమైనవి. అలాంటి సందర్భాలలో, వడ్డీని తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మీకు చివరి ప్రాధాన్యత అవుతుంది.

2. క్రెడిట్ స్కోరు చాలా తక్కువగా ఉన్నప్పుడు:

ఏ కారణం చేతనైనా మీ క్రెడిట్ స్కోరు మెరుగైన ఆఫర్ పొందడానికి వీలు లేకుండా చాలా తక్కువగా ఉన్నప్పుడు అధిక వడ్డీకి పర్సనల్​ లోన్​ తీసుకోక తప్పకపోవచ్చు!

3. తక్కువ మొత్తంలో, తక్కువ కాలానికి తీసుకుంటే:

మీరు తీసుకునే మొత్తం చాలా తక్కువగా (ఉదాహరణకు రూ. 1 లక్ష) ఉండి, దానిని తక్కువ వ్యవధిలో (ఉదాహరణకు ఆరు నెలలు) తిరిగి చెల్లించడానికి మీకు సరైన ప్రణాళిక ఉన్నప్పుడు అధిక వడ్డీకి పర్సనల్​ లోన్​ తీసుకోవచ్చు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్కీ అని గుర్తుపెట్టుకోండి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం