స్టాక్ మార్కెట్ నేడు ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైంది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ లాభాలను నమోదు చేశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు (0.86%) పెరిగి 85,154.15 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే, ఇది 188.60 పాయింట్లు (0.73%) పెరిగి కీలకమైన 26,057.20 మార్కు వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది.
సాధారణంగా ఆసియా మార్కెట్లలో బలహీనత ఉంటే, దాని ప్రభావం మన మార్కెట్‌పై కూడా ఉంటుంది. అంతేకాకుండా, ముందు రోజు రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్‌లో స్వల్ప పతనం కనిపించింది. అయినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ ఏకంగా పెరగడానికి ముఖ్య కారణం... భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందనే వార్తలే. ఈ సానుకూల వాతావరణం అన్ని రంగాల్లో కొనుగోళ్లకు దారితీసింది.
సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో మెరిసినా, విస్తృత మార్కెట్లు మాత్రం మిశ్రమంగా కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.2% లాభపడింది. అయితే, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.1% స్వల్పంగా తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ కూడా 0.5% లాభపడి, 58,200 స్థాయి పైన ట్రేడ్ అవుతోంది.
రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్స్ సెక్టార్లలో బలమైన కొనుగోళ్లు జరిగి భారీ లాభాలు కనిపించాయి. మరోవైపు, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ రంగాలు మాత్రం నష్టాల్లో కొనసాగాయి.
గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో, బెంచ్‌మార్క్ సూచీలైన నిఫ్టీ 50, సెన్సెక్స్ దాదాపు 3% పెరిగాయి. దీనికి తోడు, దేశీయ అతిపెద్ద సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ రంగంలోని దిగ్గజ సంస్థల నుంచి వచ్చిన స్థిరమైన క్యూ2 త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ ర్యాలీకి బలాన్నిచ్చాయి.
(నిరాకరణ: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి లేదా బ్రోకింగ్ సంస్థలకు చెందినవి. దయచేసి ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు ధృవీకరించబడిన ఆర్థిక నిపుణులను సంప్రదించాలని పెట్టుబడిదారులకు సూచిస్తున్నాము.)
టాపిక్