stock market: అధో పాతాళం దిశగా స్టాక్ మార్కెట్; ఒక్క రోజులో రూ. 10 లక్షల కోట్లు ఆవిరి-sensex crashes 2 500 points in 5 days 5 main reasons behind this market fall ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market: అధో పాతాళం దిశగా స్టాక్ మార్కెట్; ఒక్క రోజులో రూ. 10 లక్షల కోట్లు ఆవిరి

stock market: అధో పాతాళం దిశగా స్టాక్ మార్కెట్; ఒక్క రోజులో రూ. 10 లక్షల కోట్లు ఆవిరి

Sudarshan V HT Telugu
Published Feb 11, 2025 02:59 PM IST

Stock market crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత ఐదు సెషన్లలో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్‌లో సెన్సెక్స్ 1,200 పాయింట్లకు పైగా పడిపోయి, 77,000 కంటే తక్కువ స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 50 కీలకమైన 23,000 కన్నా దిగువకు చేరింది.

అధో పాతాళం దిశగా స్టాక్ మార్కెట్
అధో పాతాళం దిశగా స్టాక్ మార్కెట్ (Pixabay)

Stock market crash: భారతీయ స్టాక్ మార్కెట్ మంగళవారం కుప్పకూలింది. సెన్సెక్స్ 12 వందల పాయింట్లకు పైగా, నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ సుమారు 2500 పాయింట్లు నష్టపోయింది. కొనసాగుతున్న విదేశీ మూలధన అమ్మకాలు, బలహీనమైన క్యూ 3 ఆదాయాలపై ఆందోళనలు, ఆర్థిక వృద్ధి మందగించడం, దేశీయ కరెన్సీ డాలర్‌తో పోలిస్తే అన్ని కాలాలకంటే తక్కువ స్థాయికి పడిపోవడం వంటి వాటి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ఇటీవల అమ్మకాల ఒత్తిడికి గురవుతోంది.

ఐదు సెషన్లలో 2500 పాయింట్లు నష్టం

గత ఐదు రోజుల్లో మార్కెట్ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 2,500 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 50 23,000 కంటే తక్కువకు పడిపోయింది. ఫిబ్రవరి 11, మంగళవారం, సెన్సెక్స్ దాని మునుపటి ముగింపు 77,311.80తో పోలిస్తే 77,384.98 వద్ద ఓపెన్ అయింది. కానీ, సెషన్‌లో 1,281 పాయింట్లు పడిపోయి 76,030.59కి చేరుకుంది. నిఫ్టీ 50 దాని మునుపటి ముగింపు 23,381.60తో పోలిస్తే 23,383.55 వద్ద ఓపెన్ అయి, దాదాపు 400 పాయింట్లు లేదా 1.7 శాతం పడిపోయి 22,986.65 కి చేరుకుంది. బెంచ్‌మార్క్‌లను అధిగమించి, బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సెషన్‌లో 3 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. మంగళవారం నాటి నష్టాన్ని కూడా కలిపితే, గత ఐదు సెషన్లల్లో సెన్సెక్స్ 2,553 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 50 753 పాయింట్లు లేదా 3.2 శాతం నష్టపోయింది.

చివరగా ఫిబ్రవరి 4వ తేదీన..

ఫిబ్రవరి 4వ తేదీన సెన్సెక్స్ చివరిసారిగా పెరిగింది. అప్పుడు బీఎస్ఈ లో లిస్ట్ అయి ఉన్న సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 426 లక్షల కోట్లు. మంగళవారం నాటికి అది దాదాపు రూ. 408 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, గత ఐదు రోజుల్లో పెట్టుబడిదారులు దాదాపు రూ. 18 లక్షల కోట్లను కోల్పోయారు. మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో, సెన్సెక్స్ 1,082 పాయింట్లు లేదా 1.40 శాతం పడిపోయి 76,230 వద్ద ఉంది, నిఫ్టీ 50 345 పాయింట్లు లేదా 1.48 శాతం పడిపోయి 23,036 వద్ద ఉంది.

భారత స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టాక్ మార్కెట్ పతనానికి ఐదు కీలక కారణాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.

1. భారీ ఎఫ్పీఐ అమ్మకాలు

అమెరికా బాండ్ లపై లాభాలు పెరగడం, డాలర్ బలపడటం, త్వరలోనే ఫెడ్ రేట్ తగ్గించే అవకాశాలు తగ్గిపోవడం.. తదితర కారణాల వల్ల గత అక్టోబర్ నుండి విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్‌లను పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. ఫిబ్రవరి 10 వరకు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) నగదు విభాగంలో రూ. 12,643 కోట్ల విలువైన భారత స్టాక్‌లను అమ్మారు. అక్టోబర్ నుండి, వారు భారత స్టాక్ మార్కెట్ నుండి రూ. 2.75 లక్షల కోట్లకు పైగా తీసుకున్నారు.

2. బలహీనమైన క్యూ3 రాబడులు

భారతీయ కంపెనీల డిసెంబర్ త్రైమాసికం (క్యూ3) రాబడులు గత రెండు త్రైమాసికాల కంటే స్వల్పంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, అవి అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి, అనేక స్టాక్స్ వాటి ఫండమెంటల్స్ కు మించి కదులుతున్నాయనే ఆందోళనలు పెరిగాయి. గత రెండు త్రైమాసికాల కంటే క్యూ3 రాబడులు స్వల్పంగా మెరుగ్గా ఉన్నాయి. అయితే వాల్యుయేషన్లు సూచించిన అంచనాలతో పోలిస్తే రాబడులు నిరాశాజనకంగా కొనసాగుతున్నాయి. కన్స్యూమర్ స్టేపుల్స్, ఆటోలు, బిల్డింగ్ మెటీరియల్స్ ఆశాజనకంగా ఉన్నాయని, స్పెషాలిటీ కెమికల్స్ కోలుకుంటున్నాయని మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సహ వ్యవస్థాపకుడు ప్రమోద్ గుబ్బి తెలిపారు.

3. రూపాయి బలహీనత

అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనపడడం మార్కెట్ ప్రతికూల సెంటిమెంట్ కు ప్రధాన కారణాల్లో ఒకటి. డాలర్ తో దేశీయ కరెన్సీ విలువ సోమవారం 88 స్థాయికి దగ్గరగా పడిపోయింది, ఈ సంవత్సరం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 3 శాతం పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటుందనే ఊహాగానాల మధ్య మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ 61 పైసలు పెరిగి 86.84 వద్ద ముగిసింది.

4. అధిక వాల్యుయేషన్ లు

ఇటీవలి కరెక్షన్ ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ ఇంకా ఖరీదైనదిగానే ఉందని నిపుణులు భావిస్తున్నారు, ఆదాయ రికవరీ యొక్క బలహీనమైన అంచనాలు సెంటిమెంట్ ను తక్కువగా ఉంచుతున్నాయి. వాల్యుయేషన్లు పెరిగాయని, రాబడులు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని గుబ్బి అన్నారు. ఎఫ్ఐఐలు లార్జ్ క్యాప్ లలో నిరంతరం అమ్మకాలు జరపడం వల్ల వాటి వాల్యుయేషన్లు కొంత తగ్గాయి. మిడ్, స్మాల్ క్యాప్ ల వాల్యుయేషన్లు అధికంగా కొనసాగుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈక్విటీ మార్కెట్ అని, ఎంతటి 'హ్యాండ్ వేవింగ్' చేసినా దాని వాల్యుయేషన్ ను సమర్థించలేరని వాల్యుయేషన్ గురువు అశ్వత్ దామోదరన్ అభిప్రాయపడ్డారు.

5. వాణిజ్య యుద్ధం భయాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అనేక సుంకాలను ప్రకటించారు. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే, ద్రవ్యోల్బణాన్ని పెంచే విస్తృత వాణిజ్య యుద్ధంగా పరిణమించి, మార్కెట్ ఆందోళనలను మరింత పెంచింది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ 25 శాతం సుంకం విధించారని, ఇది కెనడా, మెక్సికోలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్ లపై అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై వాటి ప్రభావం ఇన్వెస్టర్లను రిస్క్ ఈక్విటీల పట్ల అప్రమత్తంగా ఉంచాయి.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకరేజీ సంస్థలవి. హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner