Stock market crash: వరుసగా రెండో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్; మళ్లీ 71,186 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్
Stock market crash: స్టాక్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పతనం చోటు చేసుకుంది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ నిరాశాజనక క్యూ 3 ఫలితాలతో బుధవారం కుప్పకూలిన భారతీయ స్టాక్ మార్కెట్.. గురువారం కూడా అదే తీరును కొనసాగించింది.
Stock market crash: స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిశాయి. బుధవారం ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీలపై గురువారం కూడా పడింది. దాంతో ఆ రెండు బెంచ్ మార్క్ సూచీలు మరోసారి తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 71,186 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,465 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఆల్ టైం హై నుంచి..
జనవరి 16న 22,000 పాయింట్లకు పైగా ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన నిఫ్టీ.. జనవరి 18, గురువారం రోజు 21,500 మార్క్ దిగువకు పడిపోయింది. అదేవిధంగా, సెన్సెక్స్ మంగళవారం 73,000 పాయింట్లకు పైగా జీవితకాల గరిష్టాన్ని టచ్ చేసింది. ఆ మరుసటి రోజే భారీ పతనాన్ని చవి చూసింది. బుధవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్లు నష్టపోయాయి.
సెన్సెక్స్, నిఫ్టీ
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ 3 ఫలితాలను విడుదల చేసిన మరుసటి రోజు నుంచి స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైంది. నాటి నుంచి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2060 పాయింట్లకు పైగా క్షీణించింది. గురువారం ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 757.36 పాయింట్లు క్షీణించి 70,751.77 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 279.80 పాయింట్లు క్షీణించి 21,292.15 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభంలో భారీ నష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్, నిఫ్టీలు ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి కొంత కోలుకున్నాయి.
హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ ఎఫెక్ట్..
మొత్తం స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ షేర్లు బుధవారం బ్యాంక్ నిఫ్టీ సూచీ భారీగా పడిపోవడానికి కారణమయ్యాయి. ఇది ప్రారంభ మార్కెట్ సెషన్లో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్ ల పతనానికి దారితీసింది. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తో పాటు ఇతర ప్రైవేటు బ్యాంక్ ల షేర్లు కూడా నష్టపోయాయి. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ క్యూ 3 ఫలితాల కారణంగా నిఫ్టీ 50 భారీ నష్టాన్ని చవిచూసింది. 2022 తర్వాత మొదటిసారి 430 పాయింట్లకు పైగా పడిపోయింది.