Stock Market: వరుసగా 8 సెషన్లలో ‘బేర్’ మన్న స్టాక్ మార్కెట్లు; ఇది రెండేళ్ల రికార్డు; మొత్త నష్టం ఎంత?
Stock Market crash: భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపుతోంది. అనూహ్య నష్టాలతో పెట్టుబడిదారులు ‘బేర్’ మంటున్నారు. ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ దెబ్బకు శుక్రవారం భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లతో పాటు అన్ని సెక్టోరల్ సూచీలు కుదేలయ్యాయి.

Stock Market Today: అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపై తిరిగి అదే స్థాయిలో పన్నులను విధిస్తామని ట్రంప్ చేసిన హెచ్చరిక శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ పై భారీగా ప్రతికూల ప్రభావం చూపింది. తమ ఉత్పత్తులపై పన్నులు విధించే ప్రతి దేశంపై పరస్పర సుంకాల కోసం ప్రణాళికలను రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం తన ఆర్థిక బృందాన్ని ఆదేశించిన తరువాత ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాంతో, భారత స్టాక్స్ వరుసగా ఎనిమిదో ట్రేడింగ్ సెషన్లో నష్టాల పరంపరను కొనసాగించాయి.
ఇన్వెస్టర్ల ఆందోళన
అమెరికా సుంకాల విధింపు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, పరస్పర సుంకాల వల్ల భారత్ గణనీయంగా ప్రభావితమవుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేశాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధించడాన్ని ట్రంప్ గతంలోనే తప్పుబట్టారు.
ఫలించని మోదీ దౌత్యం
ప్రస్తుతం భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. గురువారం ఆయన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో విస్తృతంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వారి మధ్య సుంకాల సడలింపు, అమెరికా చమురు, గ్యాస్ కొనుగోళ్లు పెంచడం, యుద్ధ విమానాల ఒప్పందాలు, ఇతర రాయితీలు తదితర అంశాలపై చర్చించారు. అయితే, వారి చర్చలతో భారత స్టాక్ మార్కెట్ ను ఉత్తేజపరిచే ప్రకటనలేవీ వెలువడలేదు. వారి భేటీ మార్కెట్ సెంటిమెంట్ ను పెంచడంలో విఫలమైంది.
ముందు ముందు మరిన్ని నష్టాలు..
భారత రూపాయి, అమెరికా వడ్డీ రేట్లపై సుంకాల ప్రభావం గురించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇది భారతదేశంతో సహా వర్ధమాన మార్కెట్ల నుండి మరింత నగదు ప్రవాహానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 రెండు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటికే భారత ఎక్స్ఛేంజీల నుంచి రూ.1.12 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఎఫ్ పీఐల విక్రయాల్లో ఎక్కువ భాగం దేశీయ మ్యూచువల్ ఫండ్ ల ద్వారానే జరుగుతున్నప్పటికీ హెచ్ ఎన్ ఐలు, కుటుంబ కార్యాలయాలు, ఏఐఎఫ్ లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాలు మార్కెట్లపై గణనీయమైన ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రెడ్ లోనే నిఫ్టీ, సెన్సెక్స్
నిఫ్టీ 50 శుక్రవారం సెషన్ లో 0.44 శాతం క్షీణించి 22,929 వద్ద ముగిసింది. ఇది వరుసగా ఎనిమిదో క్షీణత. గత రెండేళ్లలో వరుసగా ఎనిమిది సెషన్లలో నిఫ్టీ నష్టపోవడం ఇదే ప్రథమం. చివరిసారిగా 2023 ఫిబ్రవరి 17-28 మధ్య సూచీ వరుసగా ఎనిమిది సెషన్లలో పడిపోయింది. మరోవైపు, సెన్సెక్స్ 0.70 శాతం నష్టంతో 75,939 వద్ద ముగిసింది. ఈ రెండు సూచీలు ఈ వారం 2.6 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఈ రోజు 2.41 శాతం పతనమైంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 నేటి సెషన్ లో 3.55 శాతం పతనమైంది.
అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు కూడా..
అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు కూడా శుక్రవారం ఎరుపు రంగులో ముగిశాయి. మొత్తం 13 ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్ లు శుక్రవారం సెషన్ లో నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.77% నష్టపోయింది. నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియల్టీ 2 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో నిఫ్టీ రియల్టీ 9.31 శాతం క్షీణించగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఫార్మా వరుసగా 5 శాతం నుంచి 9 శాతం మధ్య క్షీణించాయి.భారత్ పై అమెరికా విధించనున్న సుంకాలు, అనిశ్చిత దేశీయ వృద్ధి, క్యూ3 రాబడుల్లో క్షీణత మొదలైనవి ఈ పతనానికి కారణాలుగా భావిస్తున్నారు.
సూచన: ఈ వ్యాసంలో ఇచ్చిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి. ఇవి హెచ్ టీ తెలుగు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించవు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
సంబంధిత కథనం