ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో తక్కువ వడ్డీకి గృహ రుణం ఎక్కడ వస్తుంది? రూ.30 లక్షల లోన్‌కు లెక్కింపు!-sbi vs hdfc bank home loan interest rates know which bank is better check monthly emi for 30 lakh rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో తక్కువ వడ్డీకి గృహ రుణం ఎక్కడ వస్తుంది? రూ.30 లక్షల లోన్‌కు లెక్కింపు!

ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో తక్కువ వడ్డీకి గృహ రుణం ఎక్కడ వస్తుంది? రూ.30 లక్షల లోన్‌కు లెక్కింపు!

Anand Sai HT Telugu

సొంత ఇంటి కల అందరికీ ఉంటుంది. ఇందుకోసం చాలా మంది లోన్స్ తీసుకుంటారు. అయితే ఏ బ్యాంకులో ఎంత వస్తుందనేది ముందుగానే తెలుసుకోవాలి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో ఎందులో తక్కువ వడ్డీకి గృహ రుణం వస్తుందో చూద్దాం..

గృహ రుణాలపై వడ్డీ రేట్లు

ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కొనాలని అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ధరలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. సొంత ఇల్లు కొనడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఉద్యోగం చేసేవారు సొంత ఇల్లు కొనేందుకు చాలా వరకు లోన్ మీద ఆధారపడుతారు. ఇల్లు కొనడానికి ఒక వ్యక్తి జీవితాంతం లోన్ కట్టాల్సి ఉంటుంది.

బ్యాంకు నుండి గృహ రుణాలు తీసుకొని ఇల్లు కొంటే ప్రతి నెలా వడ్డీతో పాటు ఇంటి ధరను ఈఎంఐ ద్వారా చెల్లిస్తారు. అయితే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గృహ రుణాల గురించి తెలుసుకుందాం.. ఏ బ్యాంకు నుండి గృహ రుణం తీసుకోవడం చౌకగా ఉంటుందో చూద్దాం..

ఎస్బీఐ వడ్డీ

ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్ల గురించి చూస్తే.. ఈ బ్యాంక్ తన కస్టమర్లకు 7.50 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. రుణం మొత్తం, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేటు పెరుగుతుంది. ఉదాహరణకు 20 సంవత్సరాల కాలానికి ఎస్బీఐ నుంచి రూ. 30 లక్షల గృహ రుణం తీసుకున్నారు అనుకుందాం. ఈ రుణాన్ని 7.50 శాతం వడ్డీ రేటుతో పొందితే.. ప్రతి నెలా రూ. 24,168 ఈఎంఐగా చెల్లించాలి. మీరు 20 సంవత్సరాలలో మొత్తం రూ. 58,00,271 బ్యాంకుకు చెల్లిస్తారు. ఇందులో వడ్డీగా రూ. 28,00,271 చెల్లించాలి.

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గృహ రుణ వడ్డీ రేట్లు చూస్తే.. ఈ బ్యాంక్ తన కస్టమర్లకు 8.15 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. రుణం మొత్తం, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుండి 20 సంవత్సరాల కాలానికి రూ. 30 లక్షల గృహ రుణం తీసుకుంటే.. ఈ రుణాన్ని 8.15 శాతం వడ్డీ రేటుతో పొందుతారు. ప్రతి నెలా రూ. 25,374 ఈఎంఐగా చెల్లించాలి. 20 సంవత్సరాలలో బ్యాంకుకు మొత్తం రూ. 60,89,756 చెల్లిస్తారు. వడ్డీగా రూ. 30,89,756 ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.