SBI 250 SIP : రూ.250తో సిప్ ప్రారంభించిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్.. 25 ఏళ్లలో ఎంత రాబడి వస్తుంది?
250 SIP : ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ 'జన్ నివేశ్ సిప్' పథకాన్ని ప్రారంభించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టేవారికి ఇది మరింత అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.250తో సిప్ ప్రారంభించొచ్చు.

ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ జన్ నివేశ్ సిప్(SIP) పథకాన్ని ప్రారంభించింది. జన్ నివేశ్ సిప్ స్కీమ్ కింద ఇన్వెస్టర్లు ఒక్కో లావాదేవీకి రూ.250 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్మన్ మాధాబీ పూరీ బుచ్ సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇది ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ యోనోతో పాటు పేటీఎం, గ్రోవ్, జీరోధా వంటి ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
రూ.250 సిప్
పెట్టుబడిదారులు సాధారణంగా సిప్‌లలో రూ .500 పెడతారు. అయితే కేవలం రూ.250 నుంచి ప్రారంభమయ్యే ఎస్బీఐ సిప్‌లతో తొలిసారి ఇన్వెస్టర్లు, చిన్న పొదుపుదారులు, అసంఘటిత రంగంలోని వారిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నందకిశోర్ తెలిపారు. రూ.250 సిప్ తన కలల్లో ఒకటని సెబీ చైర్మన్ మాదాబీ పూరీ బుచ్ అన్నారు.
పేటీఎంకు చెందిన విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో 550కిపై రిజిస్ట్రేషన్లు చూశామని తెలిపారు.
అందరికీ అందుబాటులో సిప్
ప్రతి వ్యక్తికి పెట్టుబడి అందుబాటులో ఉండేలా చేయడమే ఈ సిప్ లక్ష్యం. ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇలాంటి పెట్టుబడి ఎంపికలను ప్రారంభించే అవకాశం ఉంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశం అందుబాటులో ఉంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇది అందరి కోసం రూపొందించిన స్కీమ్. దేశంలోని వీధి వ్యాపారులతో పాటు, కార్మిక వర్గాన్ని కూడా మ్యూచువల్ ఫండ్లతో అనుసంధానించడానికి ఈ చర్య ఉపయోగపడనుంది.
25 ఏళ్ల పెట్టుబడికి ఎంత వస్తుంది?
ఉదాహరణకు మీ ఇంట్లో బాబు లేదా పాప పుడితే వారి కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ సిప్ ఎలా రాబడులు ఇస్తుందో చూద్దాం.. నెలకు రూ. 250 చొప్పున సిప్ ప్రారంభించి 25 సంవత్సరాలు నిరంతరం అందులో పెట్టుబడి పెట్టాలి. సగటున 12 శాతం రాబడిని అంచనా వేద్దాం. మొత్తం కాలంలో మీ పెట్టుబడి రూ.75 వేలు అవుతుంది. మెుత్తం రూ.4,74,409 అందుతాయి.
సంబంధిత కథనం