ఎస్బీఐ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కి మార్చాలా? ఆన్‌లైన్‌లో మీరే చేసుకోవచ్చు
SBI Account Transfer : అవసరాలతో వేరే ఊర్లకు వెళ్లి స్థిరపడుతాం. అలాంటి సమయంలో బ్యాంక్ అకౌంట్ కూడా ఉన్న ప్రదేశానికి మార్చుకోవాలనుకుంటాం. అలా మీరు కూడా చూస్తుంటే.. ఎస్బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
మీరు ఉన్న ప్రదేశానికి ఎస్బీఐ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఇప్పుడు చాలా ఈజీ. గతంలోలాగా మీరు పదిసార్లు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని లేదు. లైన్‌లో నిలబడి ఫారమ్‌ను నింపి మీ బ్రాంచ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి నుండి మీకు నచ్చిన శాఖకు మీ ఖాతాను మార్చుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ చెల్లింపులలాగానే.. ఎస్బీఐ కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో కూడా బ్రాంచ్ మార్చుకోవచ్చు. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఆన్‌లైన్‌లో సేవలను అందిస్తోంది. దీనితో పాటు, కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో సులభమైన మార్గంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
టెక్నాలజీ పెరగడంతో దాదాపు అన్నీ లావాదేవీలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఎస్బీఐ తన సేవలను కూడా.. ఆన్‌లైన్ చేసింది. తద్వారా కస్టమర్ బ్రాంచ్‌కు వెళ్లి ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. వినియోగదారులకు సులభమైన లావాదేవీల కోసం అనేక ఆన్‌లైన్ సౌకర్యాలను అందిస్తుంది ఎస్బీఐ.
మీకు ఎస్బీఐ అకౌంట్ ఉన్నట్టైతే.. బ్యాంక్ బ్రాంచ్ మార్చాలనుకుంటే.. బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. ఎస్బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించి శాఖను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. మీ సమయాన్ని వృథా చేయనవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు మార్చుకోవచ్చు.
ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ బ్రాంచ్‌ని మార్చుకోవాలనే అభ్యర్థనను నెట్ బ్యాంకింగ్ ద్వారా నమోదు చేయాలి. దీంతో మీ ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్న బ్రాంచ్ కోడ్ అవసరం. అలాగే మీ మొబైల్ నంబర్‌ను బ్యాంక్‌లో నమోదు చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండాలి. కింది విధంగా బ్రాంచ్ మార్చుకోండి..
ఇలా బ్రాంచ్ మార్చాలి
ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ onlinesbi.comకి లాగిన్ అవ్వండి.
పర్సనల్ బ్యాంకింగ్‌పై క్లిక్ చేయండి.
వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌పై క్లిక్ చేయండి.
తర్వాత ఈ-సేవ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ట్రాన్స్‌ఫర్ సేవింగ్స్ అకౌంట్‌పై క్లిక్ చేయండి.
మీ ఖాతాను ట్రాన్స్‌ఫర్ చేసే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఖాతాను బదిలీ చేయాలనుకుంటున్న బ్రాంచ్ IFSC కోడ్ వివరాలను నమోదు చేయాలి.
తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని.. క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
కొన్ని రోజుల తర్వాత మీ ఖాతా మీరు ఎంచుకున్న బ్రాంచికి బదిలీ అవుతుంది.
యోనో యాప్ ద్వారా
ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ బ్రాంచ్ యోనో యాప్ ద్వారా కూడా మార్చుకోవచ్చు. మీ మొబైల్ నంబర్‌ను మీ స్టేట్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. అందులో ఓటీపీ అడుగుతుంది. తర్వాత వివరాలను నమోదు చేయాలి. మీకు ఓటీపీ రాకపోతే.. ఖాతాను మార్చడం కష్టం.