ఇండియాలో సేఫ్టీకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపు పొందిన టాటా మోటార్స్ నుంచి హారియర్ ఈవీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పుడు ఈ టాటా హారియర్ ఈవీని భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ చేశారు. అందరు ఊహించినట్టుగానే ఈ హారియర్ ఈవీకి 5 స్టార్ రేటింగ్ లభించింది! పూర్తి వివరాల్లోకి వెళితే..
టాటా హారియర్ ఈవీ అడల్ట్స్ భద్రత విభాగంలో 32కి 32 పాయింట్లు సాధించి అద్భుతమైన పనితీరును కనబరిచింది. పిల్లల భద్రత విభాగంలో 49కి 45 పాయింట్లు పొందింది!
ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్ : ఈ పరీక్షలో హారియర్ ఈవీీ 16కి 16 పాయింట్లు సాధించింది.
సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్: ఈ పరీక్షలో కూడా 16కి 16 పాయింట్లు పొందింది.
పిల్లల భద్రత విషయంలో, డైనమిక్ స్కోరు 24కి 24 పాయింట్లతో, సీఆర్ఎస్ (చైల్డ్ రెస్ట్రయింట్ సిస్టమ్) ఇన్‌స్టాలేషన్ స్కోరు 12కి 12 పాయింట్లతో కొత్త ఎలక్ట్రిక్ కారు పూర్తి స్కోర్‌ను సాధించింది. వెహికిల్ అసెస్‌మెంట్ స్కోరులో హారియర్ ఈవీ 13కి 9 పాయింట్లు పొందింది.
టాటా హారియర్ ఈవీకి లభించిన ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ఈ వాహనం భద్రతకు టాటా మోటార్స్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భద్రతా ప్రమాణాలను పెంచడంలో గణనీయమైన ముందడుగుగా నిలుస్తుంది.
టాటా హారియర్ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. అవి 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్. పెద్ద బ్యాటరీ రేంజ్ 620 కి.మీ వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఇక టాటా హారియర్ ఈవీ బుకింగ్స్ జులై 2న ప్రారంభంకానున్నాయి. టాటా మోటార్స్ అధికారిక వెబ్సైట్ లేదా సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శించి టాటా హారియర్ ఈవీని మీరు బుక్ చేసుకోవచ్చు.
భారత ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో అత్యధిక మార్కెట్ షేరు కలిగిన సంస్థగా టాటా మోటార్స్ కొనసాగుతోంది. టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ, టాటా కర్వ్ ఈవీ, టాటా టిగోర్ ఈవీ మోడల్స్‌తో సంస్థ పోర్ట్‌ఫోలియో బలంగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఇతర సంస్థల ఈవీ ప్రాడక్ట్స్ నుంచి టాటా మోటార్స్‌కి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పోటీని తట్టుకునేందుకు సంస్థ భారీ స్కెచ్ వేసింది. టాటా హారియర్ ఈవీ ఇందులో భాగం. ఈ మోడల్‌పై సంస్థ భఆరీ అంచనాలు పెట్టుకుంది.
సంబంధిత కథనం