Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ధర పెంపు; ఈ ఫీచర్ కారణంగానే..-royal enfield super meteor gets a price hike because of this new feature ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ధర పెంపు; ఈ ఫీచర్ కారణంగానే..

Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ధర పెంపు; ఈ ఫీచర్ కారణంగానే..

HT Telugu Desk HT Telugu
Nov 17, 2023 05:14 PM IST

Royal Enfield price hike: కొత్త వింగ్‌మ్యాన్ (Wingman) ఫీచర్ కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర పెరిగింది. నవంబర్ 16, 2023 నుండి సూపర్ మీటియో 650 (Super Meteor 650) ని బుక్ చేసుకునే కస్టమర్‌లు ఈ ఫీచర్‌ ని స్టాండర్డ్ ఫీచర్ గా పొందుతారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Royal Enfield price hike: సూపర్ మీటియో 650 ధరను రాయల్ ఎన్ ఫీల్డ్ రూ.6,500 పెంచింది. బైక్ లో అదనంగా 'వింగ్‌మ్యాన్ (Wingman)' అనే కొత్త ఫీచర్‌ను జోడించిన కారణంగా ఈ పెంపు అనివార్యమైందని రాయల్ ఎన్ ఫీల్డ్ వెల్లడించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ భవిష్యత్ మోడళ్లలో ఈ వింగ్ మ్యాన్ ఫీచర్ ను ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా అందించాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ యోచిస్తోంది.

ఇప్పటికే ఉన్న మోడల్స్ పై..

ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియో 650 బైక్ ను కొనుగోలు చేసిన కస్టమర్‌లు నామమాత్రపు ఫిట్‌మెంట్ ధరతో పరికరాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, నవంబర్ 16, 2023 నుంచి సూపర్ మీటియో 650 బైక్ ని బుక్ చేసుకునే కస్టమర్‌లు ఈ (Wingman) ఫీచర్‌ని ప్రామాణికంగా పొందుతారు.

వింగ్ మ్యాన్ ఫీచర్ వివరాలు..

వింగ్‌మ్యాన్ (Wingman) ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS డివైజ్‌లలో ఉండే రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్లికేషన్‌లో అంతర్భాగంగా వస్తుంది. ఈ వింగ్‌మ్యాన్ టెలిమాటిక్స్ హార్డ్‌వేర్‌తో వస్తుంది. ఇది రైడర్‌కు మోటార్‌సైకిల్ పనితీరు, సమస్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇందులో ఇంటరాక్టివ్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. దీని ద్వారా రైడర్ ఫ్యెయెల్ లెవెల్, బ్యాటరీ స్థితి, సర్వీస్ నోటిఫికేషన్లను పొందుతాడు. ఇంజిన్ ఆన్/ఆఫ్ అలర్ట్‌లు, జీపీఎస్ - లొకేషన్ ట్రాకింగ్, చివరిగా పార్క్ చేసిన లొకేషన్ ట్రాకింగ్, వాక్-టు-మై-మోటార్‌సైకిల్.. వంటి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. సడన్ బ్రేకింగ్, సడన్ యాక్సిలరేషన్, రోజువారీ రైడ్స్, రైడింగ్ ప్యాటర్న్స్, రైడ్ రూట్స్, గరిష్ట వేగం, సగటు వేగం మొదలైన సమాచారాన్ని కూడా ఈ (Wingman) అప్లికేషన్ చూపుతుంది.

సురక్షిత రైడింగ్

ఈ వింగ్ మ్యాన్ (Wingman) ఫీచర్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ పై ప్రయాణం మరింత సురక్షితమవుతుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బీ గోవిందరాజన్ తెలిపారు. కస్టమర్లకు మరింత సురక్షిత రైడింగ్ అనుభవాన్ని ఇచ్చే దిశగా ఈ వింగ్ మ్యాన్ ఫీచర్ ను రూపొందించామన్నారు. ఈ ఫీచర్ ఎన్ ఫీల్డ్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.