రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ అమ్మకాలు.. ఈ బైక్‌‌లకు విదేశాల్లోనూ క్రేజ్!-royal enfield april 2025 sales records over 86000 sales rises 6 percentage growth ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ అమ్మకాలు.. ఈ బైక్‌‌లకు విదేశాల్లోనూ క్రేజ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ అమ్మకాలు.. ఈ బైక్‌‌లకు విదేశాల్లోనూ క్రేజ్!

Anand Sai HT Telugu

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎల్లప్పుడూ వీటికి డిమాండ్ ఉంటుంది. ఏప్రిల్ 2025లోనూ బైకులు మంచి అమ్మకాలు చేశాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో కూడా భారీ కస్టమర్ బేస్ ఉంది. దీని కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతి నెలా భారీ అమ్మకాల గణాంకాలను నమోదు చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025 నెలలో అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

6 శాతం వృద్ధి

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025లో మొత్తం 86,559 బైక్‌లను (దేశీయ అమ్మకాలు ప్లస్ ఎగుమతులు) విక్రయించింది. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో కేవలం 82,043 మాత్రమే. దీనితో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.

దేశీయ అమ్మకాల్లో వృద్ధి

దేశీయ అమ్మకాలను మాత్రమే పరిశీలిస్తే ఏప్రిల్ 2025లో 76,002 బైక్‌లను విక్రయించింది. ఏప్రిల్ 2024తో పోలిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ అమ్మకాలలో 1 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే ఏప్రిల్ 2024లో దాదాపు అంతే సంఖ్యలో బైక్‌లను విక్రయించింది.

ఎగుమతులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏప్రిల్ 2025లో భారతదేశం నుండి 10,557 బైక్‌లను ఎగుమతి చేసింది. ఈ సంఖ్య ఏప్రిల్ 2024లో కేవలం 6,832 మాత్రమే. ఎగుమతుల్లో ఈ అద్భుతమైన వృద్ధి కారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

అమ్మకాలు పెంచేందుకు భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త బైక్‌లను, ఇప్పటికే ఉన్న బైక్‌ల మోడళ్ల అప్డేట్ వెర్షన్లను నిరంతరం విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా 2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను కొన్ని రోజుల క్రితం భారతదేశంలో అమ్మకానికి విడుదల చేశారు. అలాగే కొన్ని రోజుల క్రితం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ నేపాల్‌లో అమ్మకానికి విడుదలైంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.