Rolls Royce Ghost Series II : భారత్‌లోకి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II ఎంట్రీ.. ఈ లగ్జరీ కారులో సూపర్ ఫీచర్లు!
Rolls Royce Ghost Series II : భారతదేశంలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II అందుబాటులోకి వచ్చింది. సరికొత్త స్టైలింగ్‌తో ఘోస్ట్ సిరీస్ ఎక్స్ టీరియర్ డిజైన్ తీసుకొచ్చారు.

లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత మార్కెట్లోకి తమ సరికొత్త ఘోస్ట్ సిరీస్ 2 మోడల్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ఇంటీరియర్ ఫీచర్లను, ఎక్స్‌టీరియర్ ఫీచర్లను ఈ సిరీస్‌తో పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. అధునాతన సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ సహాయంతో రూపొందించిన ఈ లగ్జరీ కారుతో వినియోగదారులు డిజిటల్ ప్రపంచానికి మరింత చేరువయ్యేలా చేశారు.
'ఘోస్ట్ సిరీస్ సామర్థ్యాలను మా వినియోగదారులు తప్పకుండా ప్రశంసిస్తారని ఆశిస్తున్నాం. ఘోస్ట్ సిరీస్ 2 ప్రత్యేక ఉనికిని చాటుతుంది. మునుపెన్నడూ లేని విధంగా అధునాతన సాంకేతికత వినియాగంతో ఈ డ్రైవర్ ఫోకస్డ్ వీ 12 రోల్స్ రాయిస్ లగ్జరీ కారు ప్రత్యేకంగా నిలవనుంది. భారతదేశంలో లగ్జరీ కార్లను కోరుకునేవారికి రోల్స్ రాయిస్ మెుదటిస్థానంలో ఉంటుంది. ఘోస్ట్ సిరీస్ 2 ప్రస్తుతం భారతదేశంలో లభ్యం అవుతోంది.' అని ఐరీన్ నిక్కైన్, రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ చెప్పారు.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ II అద్భుతమైన పనితీరును అందించే ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో డ్రైవర్ సెంట్రిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ మోడల్‌లో ప్లానార్ సస్పెన్షన్ సిస్టమ్, ఫ్లాగ్‌బేరర్, శాటిలైట్-ఎయిడెడ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఉన్నాయి. డ్రైవర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కొత్త SPIRIT డిజిటల్ ఇంటర్‌ఫేస్, విస్పర్స్ ప్రైవేట్ మెంబర్ యాప్ మెరుగైన ఆడియో సిస్టమ్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఈ కారులో ఉన్నాయి.
భారత్‌లో లభించే వేరియంట్లు
1. ఘోస్ట్ సిరీస్ 2
2. బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2
3. ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2
రోల్స్ రాయిస్ ధర
- ఘోస్ట్ సిరీస్ 2 ధర - రూ. 8,95,00,000
- ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2 ధర – రూ. 10,19,00,000
- బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2 ధర – రూ. 10,52,00,000
చెన్నై, దిల్లీ షోరూంలలో ఈ కార్లను ఆర్డరు చేసుకునే సౌకర్యం ఉందని కంపెనీ తెలిపింది.