ఫిబ్రవరిలో చరిత్రలోనే స్టాక్ మార్కెట్ మహా పతనం.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత వార్నింగ్!
Stock Market Prediction : స్టాక్ మార్కెట్‌కు ఈ ఏడాది ప్రత్యేకంగా ఏమీ లేదు. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 19 ట్రేడింగ్ రోజులు మాత్రమే గడిచిపోయాయి. కానీ చాలా వరకు మార్కెట్ భారీ పతనాన్ని చూసింది.
ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్ భారీగా పతనాన్ని చూసింది. లక్షల కోట్లు నష్టపోయాయి. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 19 ట్రేడింగ్ రోజులు మాత్రమే గడిచినా.. మార్కెట్ భారీ పతనాన్ని చూసింది. సోమవారం ట్రేడింగ్‌లో మార్కెట్ 800 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ పతనం తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.10 లక్షల కోట్లు నష్టపోయారు.

ఇంతలో మరో వార్త స్టాక్ మార్కెట్‌ను భయపెడుతోంది. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' అనే ప్రసిద్ధ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి స్టాక్ మార్కెట్ గురించి పెద్ద జోస్యం చెప్పారు. 2025 ఫిబ్రవరిలో చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం జరగబోతోందని ఆయన అన్నారు. ఈ మేరకు అందరినీ అప్రమత్తం చేస్తూ.. ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఫిబ్రవరిలో వచ్చే స్టాక్ మార్కెట్ క్రాష్.. అంతకుముందు జరిగిన పతనాల కంటే చాలా పెద్దగా ఉంటుందని కియోసాకి జోస్యం చెప్పారు. వెంటనే మేల్కొని అప్రమత్తమైతే సేఫ్ జోన్‌లో ఉండొచ్చన్నారు. వచ్చే నెలలో రాబోయే పతనం భారీగా నష్టాలను చూపిస్తుందన్నారు.
కియోసాకి ప్రకారం, ఈ అంచనా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లో భారీ ప్రకంపనలకు కారణమవుతుంది. ఇది ఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బే. ఏదేమైనా త్వరగా అప్రమత్తమయ్యే.. పెట్టుబడిదారులకు ఇది గొప్ప అవకాశమన్నారు. స్టాక్ మార్కెట్ పతనం గొప్ప కొనుగోళ్లకు అవకాశం ఇస్తుందని రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. స్టాక్ మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటి ఆస్తులు చౌకగా లభిస్తాయి. స్టాక్, బాండ్ మార్కెట్లకు అతీతంగా ప్రత్యామ్నాయ పెట్టుబడులపై జనాలు దృష్టి సారించనున్నారు. క్రిప్టోకరెన్సీలు విపరీతంగా పెరుగుతాయని అంచనా. దీని వృద్ధి అధికంగా ఉంటుందని అంచనా వేశారు.
కియోసాకి రిచ్ డాడ్ పుస్తకంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. తన పుస్తకంలో స్టాక్ మార్కెట్ పతనం గురించి హెచ్చరించారు. 2025 ఫిబ్రవరిలో ఈ అంచనా నిజమవుతుందని ఆయన తాజాగా సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేశారు. అయితే మార్కెట్ పతనాన్ని కియోసాకి గొప్ప అవకాశంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆస్తులు, వాహనాలతో సహా వివిధ ఆస్తులు మరింత అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు జనాలు మెుగ్గుచూపాలని కియోసాకి సూచిస్తున్నారు.