Republic Day 2024: దశాబ్దాల పాటు ఇండియన్ ఆర్మీకి సేవలందించిన ఈ ఐదు కార్ల గురించి తెలుసా..?
Cars served in the Indian Army: హిందుస్థాన్ అంబాసిడర్ నుండి మహీంద్రా స్కార్పియో క్లాసిక్ వరకు, భారత సైన్యానికి సేవలను అందించిన ఐదు బెస్ట్ కార్స్ ఇవి..

భారతీయ సైన్యంలో సైనికుడిగా సేవలను అందించడం గొప్ప అవకాశంగా భావిస్తుంటాం. అలాగే, ఇండియన్ ఆర్మీకి ఈ ఐదు వాహనాలు అద్బుతమైన సేవలను అందించాయి. కఠిన పరిస్థితుల్లో సైన్యానికి అండగా నిలిచాయి. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి ఈ వాహనాలను ఆర్మీకి ఆయా కంపెనీలు అందించాయి.
ఆ ఐదు ఇవే..
హిందుస్థాన్ అంబాసిడర్, మారుతీ సుజుకి జిప్సీ, టాటా సుమో 4X4, మహింద్ర స్కార్పియో, టాటా సఫారీ స్ట్రోమ్.. ఈ ఐదు ఐకానిక్ కార్లు ఇండియన్ ఆర్మీకి దశాబ్దాల పాటు సేవలను అందించాయి.
Ambassador: అంబాసడర్
హిందూస్థాన్ అంబాసిడర్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ కార్లలో ఒకటిగా పేరు గాంచింది. ఈ కారు అనేక దశాబ్దాలుగా ప్రైవేట్ కార్లు మరియు టాక్సీల రూపంలో భారతీయ రహదారులపై పరుగులు తీసింది. హిందూస్థాన్ అంబాసిడర్ దాని ధృడమైన నిర్మాణ లక్షణాలు మరియు రైడింగ్ సౌకర్యాలకు ప్రసిద్ధి చెందింది. భారత సైన్యంలోని ఉన్నతాధికారులు కొందరికి ఈ కార్లు ఇప్పటికీ సేవలను అందిస్తుండడం విశేషం. హిందుస్థాన్ అంబాసిడర్ ఉత్పత్తి 2014లో ముగిసింది.
Maruti Suzuki Gypsy: మారుతి సుజుకీ జిప్సీ
1991లో ఇండియన్ ఆర్మీ ఫ్లీట్‌లోకి మారుతి సుజుకి జిప్సీ ప్రవేశించింది. నాటి నుంచి సాయుధ దళాలకు సేవలను అందిస్తోంది. ఈ తేలికైన, కాంపాక్ట్ SUV ఎటువంటి ఇబ్బంది లేకుండా కఠిన రహదారుల్లో కూడా సైన్యానికి సహకరించింది. చురుకైన హ్యాండ్లింగ్, అద్భుతమైన పికప్, విడిభాగాల సులభ లభ్యత మారుతి సుజుకి జిప్సీని ఇండియన్ ఆర్మీకి దగ్గర చేశాయి.
Tata Sumo 4X4: టాటా సుమో 4X4
టాటా మోటార్స్‌కు భారత సైన్యంతో సుదీర్ఘ అనుబంధం ఉంది. టాటా సుమో 4X4 అనేది స్వదేశీ ఆటోమేకర్ సైన్యం కోసం తయారు చేసిన ధృఢమైన, అరుదైన సైనిక వాహనం. సైన్యం కోసం దీనిని పరిమిత సంఖ్యలో తయారు చేశారు. ఆర్మీ అంబులెన్స్ ల లాగా కూడా ఇవి ఉపయోగపడ్డాయి. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఈ SUVని కఠినమైన ఆఫ్-రోడర్‌గా మార్చింది. విశాలమైన క్యాబిన్ ఉండడంతో ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ కు అంబులెన్స్‌గా కూడా ఉపయోగపడింది.
Tata Safari Strome: టాటా సఫారీ స్ట్రోమ్
టాటా సఫారీ స్ట్రోమ్ భారత సైన్యం ఉపయోగిస్తున్న అత్యంత శక్తివంతమైన కార్లలో ఒకటి. ఈ కారును మారుతి సుజుకీ జిప్సీకి బదులుగా, మొదట భారతీయ నౌకాదళంలోకి తీసుకున్నారు. ఇండియన్ ఆర్మీ కోసం టాటా సఫారీ స్ట్రోమ్ జీఎస్ 800 మోడల్ ను టాటా మోటార్స్ ప్రత్యేకంగా రూపొందించింది. దీనికి ప్రత్యేకంగా ఆర్మీ గ్రీన్ కలర్ యొక్క ప్రత్యేక షేడ్ ను పెయింట్ చేసింది.
Mahindra Scorpio Classic: మహింద్ర స్కార్పియో క్లాసిక్
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ భారత సైన్యం మొబిలిటీ అవసరాలను తీర్చిన మరొక మాస్-మార్కెట్ కారు. ఐకానిక్ స్కార్పియో SUV ని ఆర్మీ అవసరాలకు అనుగుణంగా మార్చి స్కార్పియో క్లాసిక్ ను రూపొందించారు. దీన్ని మహీంద్రా స్కార్పియో-ఎన్‌తో పాటు విక్రయించారు. ధృఢమైన నిర్మాణ నాణ్యత, కఠినమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యం 4X4 డ్రైవ్‌ట్రెయిన్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్.. మొదలైన ఫీచర్స్ ఈ SUVని భారత సైన్యానికి సమర్థవంతమైన వాహనంగా మార్చాయి.