Reliance Jio Q1 results: 12 శాతం పెరిగిన రిలయన్స్ ‘జియో’ లాభాలు; Q1 లో జియో నికర లాభాలు రూ. 4863 కోట్లు.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను టెలీకాం దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫొకామ్ (Reliance Jio Infocomm) శుక్రవారం ప్రకటించింది. Q1FY24 లో జియో ఆదాయం రూ. 24, 042 కోట్లు. జియో ఆదాయం Q1FY23 లో రూ. 21,873 కోట్లు.
రిలయన్స్ జియో (Reliance Jio) నికర లాభాల్లో 12% వృద్ధి నమోదైంది. Q1FY24 లో భారతీయ టెలీకాం దిగ్గజం జియో రూ. 4,863 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23) లో జియో సాధించిన నికర లాభాలు రూ. 4,335 కోట్లు. Q1FY23 తో పోలిస్తే Q1FY24 లో జియో ఆదాయంలో కూడా 10% వృద్ధి నమోదైంది. Q1FY24 లో జియో ఆదాయం రూ. 24, 042 కోట్లు కాగా, Q1FY23 లో రూ. 21,873 కోట్లు.
గత త్రైమాసికంతో పోలిస్తే..
జియో ఇన్ఫోకామ్ నికర లాభాలు గత త్రైమాసికం (Q4FY23) తో పోలిస్తే, Q1FY24 లో నికర లాభాలు 3%, ఆదాయం 2.7% పెరిగింది. Q4FY23 లో జియో నికర లాభాలు రూ. 4,716 కోట్లు కాగా, Q1FY24 లో రూ. 4,863 కోట్లు. ఆదాయం Q4FY23 లో రూ. 23,394 కోట్లు కాగా, Q1FY24 లో రూ. 24, 042 కోట్లు.
ఇండియన్ టెలీకాంలో జియోదే ఆధిపత్యం
ఇండియన్ టెలీకాంలో ప్రస్తుతం రిలయన్స్ జియో ఆధిపత్యమే కొనసాగుతోంది. జియోకు భారతి ఎయిర్ టెల్ గట్టి పోటీ ఇస్తోంది. 2023 ఏప్రిల్ డేటా ప్రకారం.. భారత్ లో జియో మార్కెట్ వాటా 37.9% కాగా, ఎయిర్ టెల్ మార్కెట్ వాటా 36.5%. 2023 ఏప్రిల్ లో జియో లో కొత్తగా 30.4 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ చేరారు. సబ్ స్క్రైబర్స్ ను మరింత పెంచుకోవడం కోసం జియో కొత్తగా జియో భారత్ పేరుతో రూ. 999 లకే 4 జీ ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పటికీ 2జీ నెట్ వర్క్ లోనే ఉన్న 25 కోట్ల మంది వినియోగదారులు లక్ష్యంగా జియో, ఎయిర్ టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ కృషి చేస్తున్నాయి. మొబైల్ నెట్ వర్క్ సెగ్మెంట్ తో పాటు బ్రాడ్ బ్యాండ్ సెగ్మెంట్లో వినియోగదారులను పెంచుకోవడం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జియో వెల్లడించింది.