Puravankara's H1 sales: 43 శాతం పెరిగిన పురవంకర సేల్స్..
Puravankara's Apr-Sep sales bookings up: పురవంకర రియాల్టీ కంపెనీ సేల్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 43 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ, అక్టోబరు 24: బెంగళూరు కేంద్రంగా ఉన్న పురవంకర లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఈ ఫైనాన్షియల్ ఇయర్ తొలి అర్ధ సంవత్సరంలో బుకింగ్స్‌లో 43 శాతం పెరుగుదల కనబరిచింది. బుకింగ్స్ విలువ రూ. 1,306 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ - సెప్టెంబరు మాసంలో ప్రధానంగా హౌజింగ్‌కు డిమాండ్ పెరగడంతో సేల్స్ పెరిగాయి.
గత ఏడాది ఇదే కాలంలో పురవంకర రియల్ ఎస్టేట్ సంస్థ అమ్మకాలు రూ. 910 కోట్లుగా ఉన్నాయి. ఇక పరిమాణం విషయానికి వస్తే కంపెనీ ఈ తొలి అర్ధ సంవత్సరంలో 1.76 మిలియన్ చదరపు అడుగుల మేర అమ్మకాలు జరిపి 32 శాతం వృద్ధి కనబరిచింది. గత ఏడాది ఇదేకాలంలో 1.33 మిలియన్ చదరపు అడుగులు అమ్మింది.
అలాగే ఏప్రిల్-సెప్టెంబరు అర్ధ సంవత్సర కాలంలో విక్రయ ధరలు చదరపు అడుగుకి రూ. 7,421కి పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ అమ్మిన ధర రూ. 6,845గా ఉంది.
కంపెనీ ఆవిర్భవించనప్పటి నుంచి తొలిసారిగా ఒక అర్ధ సంవత్సరంలో అత్యధికంగా రూ. 1,306 కోట్ల విలువైన విక్రయ విలువ సాధించడం ఇదే తొలిసారి.
కంపెనీ మరో 15 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. వీటికోసం తగిన ఇన్వెస్ట్‌మెంట్లను చేస్తోంది.
‘రియల్ ఎస్టేట్ డిమాండ్ రోజురోజుకూ కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. పండగ సీజన్ ప్రారంభమయ్యాక కూడా ఈ డిమాండ్ కొనసాగుతుందని మేం నమ్ముతున్నాం..’ అని కంపెనీ తెలిపింది.
పురవంకర ఇప్పటి వరకు మొత్తం 43 మిలియన్ స్క్వేర్ ఫీట్ గల 75 ప్రాజెక్టులను పూర్తిచేసింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు, మంగళూరు, కోల్‌కతా, ముంబై, పూణే, గోవా తదితర అన్ని ముఖ్యమైన నగరాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ శ్రీలంక, జీసీసీ దేశాల్లో కూడా పలు ప్రాజెక్టులు చేపట్టింది.
గడిచిన 18 నెలలుగా అన్ని ప్రధాన రియల్ ఎస్టేట్ డెవలపర్లు (స్టాక్ మార్కెట్లో లిస్టయిన వాటి నుంచి) తమ తమ విక్రయాలు పెరిగినట్టు గణాంకాలు ప్రకటించాయి.
బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ముంబై కేంద్రంగా పనిచేసే మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్), గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్ తదితర కంపెనీలు వార్షిక సేల్స్ బుకింగ్స్‌లో అగ్రశ్రేణిగా నిలిచాయి.
ఇక ఒబెరాయ్ రియాల్టీ, శోభ, మహీంద్రా లైఫ్‌స్పేస్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రయిజెస్, పురవంకర లిమిటెడ్, శ్రీరామ్ ప్రాపర్టీస్ తదితర కంపెనీలు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి.
హోం లోన్లపై వడ్డీ రేట్లు గడిచిన 5 నెలల్లో 6.5 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగినప్పటికీ విక్రయాలు పటిష్టంగా కొనసాగుతున్నాయని ఆయా కంపెనీల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ద్రవ్యోల్భణాన్ని అదుపులో పెట్టేందుకు మే నెల నుంచి ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 190 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచింది. ఈ కారణంగా దాదాపు 2 శాతానికి పైగా హోం లోన్లపై వడ్డీ రేట్లు పెరిగాయి.
అనరాక్, ప్రాప్‌టైగర్, నైట్‌ఫ్రాంక్ వంటి ప్రాపర్టీ కన్సల్టెన్సీలన్నీ ఏడెనిమిది ప్రధాన నగరాల్లో జనవరి - సెప్టెంబరు పీరియడ్‌లోహౌజింగ్ సేల్స్ పెరిగాయని నివేదించాయి. కోవిడ్ పూర్వస్థాయి గణాంకాలను హౌజింగ్ సేల్స్ ఈ ఏడాది అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.