9 వారాల్లో రూ.11,816 కోట్లకు 173 అపార్ట్‌మెంట్ల అమ్మకాలు.. డీఎల్ఎఫ్ ప్రాజెక్టు రికార్డు!
Real Estate : రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ గురుగ్రామ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాజెక్టులో రికార్డు సృష్టించింది. హౌసింగ్ ప్రాజెక్టు 'ది దాలియాస్'లో 173 అపార్ట్‌మెంట్లను మొత్తం రూ.11,816 కోట్లకు విక్రయించింది.
రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధాన కంపెనీ అయిన డీఎల్‌ఎఫ్ ప్రాజెక్టు ఇన్వెస్టర్లకు బాగా నచ్చింది. గత ఏడాది అక్టోబర్లో గురుగ్రామ్‌లో ది దాలియాస్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 9 వారాల్లో 173 అపార్ట్ మెంట్లను రూ.11,816 కోట్లకు విక్రయించారు. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ఫేజ్-5లో 17 ఎకరాల విస్తీర్ణంలో ది దాలియాస్ అనే హౌసింగ్ ప్రాజెక్టును డీఎల్ఎఫ్ గత ఏడాది అక్టోబర్‌లో మెుదలుపెట్టింది.
మెుత్తం 23 వేల కోట్ల టార్గెట్
ఇక్కడ 420 అపార్ట్ మెంట్లు, పెంట్ హౌస్‌లు ఉన్నాయి. డీఎల్ఎఫ్ తన ది దాలియాస్ ప్రాజెక్టులో మిగిలిన 247 యూనిట్ల విక్రయం ద్వారా కనీసం రూ.23,000 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తోంది. ఇదే ప్రదేశంలో ది కామెలియాస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత డీఎల్ఎఫ్ అందిస్తున్న రెండో విలాసవంతమైన ఆఫర్ ఇది.
11,816 కోట్లు
ఈ ప్రాజెక్టులో అపార్ట్మెంట్ కనీస పరిమాణం 10,300 చదరపు అడుగులు. ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్ ప్రకారం డీఎల్ఎఫ్ 173 యూనిట్లను రూ.11,816 కోట్లకు విక్రయించింది. ఈ యూనిట్ల మొత్తం విస్తీర్ణం 18.5 లక్షల చదరపు అడుగులు. ఒక్కో హౌసింగ్ యూనిట్ నుంచి సగటున రూ.70 కోట్లు వచ్చాయి. డీఎల్ఎఫ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ త్యాగి మాట్లాడుతూ ఈ స్పెషల్ ఆఫర్‌కు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు.
ది దాలియాస్‌లో భారతీయ పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు, టాప్ చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్లు, అలాగే నాన్ రెసిడెంట్ భారతీయులు 173 అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశారు. కామెలియాస్‌లో రూ. 11,000 కోట్ల అమ్మకాలను దాటడానికి తొమ్మిదేళ్లు పట్టింది. దాలియాస్‌లో తొమ్మిది వారాలు మాత్రమే తీసుకుంది కంపెనీ. ఇక్కడ అపార్ట్‌మెంట్ సగటు ధర రూ.70 కోట్లు కాగా రూ.55 కోట్ల నుంచి రూ.125 కోట్ల రేంజ్‌లో కూడా ఉన్నాయి.
డీఎల్ఎఫ్ షేర్లు
డీఎల్ఎఫ్‌షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో జోరందుకున్నాయి. కంపెనీ షేరు ఇంట్రాడేలో 6 శాతం పెరిగి రూ.741.20 వద్ద ముగిసింది. గత వారం కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డీఎల్ఎఫ్ నికర లాభం 61 శాతం పెరిగి రూ.1,058.73 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.655.71 కోట్లుగా ఉంది. మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,643.51 కోట్ల నుంచి రూ.1,737.47 కోట్లకు పెరిగినట్లు డీఎల్ఎఫ్ జనవరి 24న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
టాపిక్