Gold Loans Issue: బంగారు రుణాలపై ఆర్‌బిఐ పిడుగు.. ఇకపై రెన్యువల్ అవకాశం లేదు, ఏడాదిలో తీర్చేయాల్సిందే…!
Gold Loans Issue: బంగారు ఆభరణాల రుణాలను రెన్యువల్, రీషెడ్యూల్ చేయడాన్ని బ్యాంకులు నిలిపి వేశాయి. గత జనవరి నుంచి ఆర్‌బిఐ నిబంధనల్ని బ్యాంకులు పక్కాగా అమలు చేస్తుండటంతో రుణాలను నిర్ణీత వ్యవధిలోగా తీర్చేయాల్సిందేనని తేల్చి చెబుతుండటంతో రుణగ్రహీతలపై ఒత్తిడి పెరుగుతోంది.
Gold Loans Issue: తెలుగు రాష్ట్రాల్లో బంగారు రుణాల మంజూరు చేయడంలో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు రుణాల చెల్లింపు వ్యవధిని ఏడాదికి పరిమితం చేశాయి. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. బంగారు రుణాల చెల్లింపుపై అమల్లోకి వచ్చిన మార్పులు రుణగ్రహీతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఏమి జరుగుతోంది అంటే…
పట్టణ ప్రాంతాల్లో బంగారు రుణాలను అగ్రికల్చర్ విభాగంలో మంజూరు చేయడంపై చాలా కాలం క్రితమే ఆర్బీఐకు ఫిర్యాదులు అందాయి. వ్యవసాయ అవసరాల కోసం కోసం తీసుకునే బంగారు రుణాల పరిమితి ఏడాదిలోపు తీర్చేయాలనే ఉద్దేశంలో వాటిని మంజూరు చేసేవారు. తక్కువ వడ్డీకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం ఈ రుణాలను మంజూరు చేసేవారు.
బ్యాంకులకు కూడా బంగారంపై ఇచ్చే రుణాలు లాభసాటిగానే ఉండేవి. పంటల సాగుకు తీసుకునే రుణాలను పంట చేతికి వచ్చిన తర్వాత తీర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు జారీ చేయడం చాలా కాలంగా ఉంది. బ్యాంకులకు లాభసాటి వ్యాపారంగా చాలా ఏళ్ల పాటు సాగింది.
బ్యాంకుల్లో బంగారం నిల్వలు పెరిగి…
బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి బంగారు రుణాలు లభిస్తుండటంతో వాటిని తీసుకోవడం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ పనులతో సంబంధం లేకుండానే ఈ అగ్రిగోల్డ్ రుణాలు పెరిగాయి. ఈ క్రమంలో బ్యాంకు లాకర్లలో బంగారు నిల్వలు పెరిగిపోవడం మొదలైంది. ఈ క్రమంలో చాలా ఏళ్ల క్రితమే బంగారు రుణాలను ఏడాదికి మించి రెన్యువల్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా బ్యాంకుల వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆర్నెల్ల క్రితం నిబంధనలు పాటించని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది.
గతంలో జారీ చేసిన నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత డిసెంబర్‌లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పాటించని బ్యాంకులకు, వాటి శాఖలకు ఇచ్చిన రుణాల మేరకు జరిమానాలు విధించింది. ఆర్బీఐ పెనాల్టీలు వేస్తుండటంతో బంగారం రుణాలపై ఆంక్షలు మొదలయ్యాయి. గత జనవరి నుంచి బంగారు రుణాలపై ఆంక్షలు మొదలయ్యాయి.
అదే బంగారంపై రుణాలు…
గతంలో బంగారు రుణాలను రెన్యువల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోన్ జనరేట్ చేసేవారు. పాత రుణ మొత్తాన్ని అసలులో జమ చేసుకుని, వడ్డీని రుణ గ్రహీత నుంచి వసూలు చేసేవారు. ఇలా చేయడం ద్వారా బ్యాంకులకు అప్పులు ఎప్పటికి తీరకపోగా వడ్డీ మాత్రమే సమకూరుతోంది. ప్రస్తుతం బ్యాంకులు దీనికి అనుమతించడం లేదు. దీనికి బదులుగా అదే బంగారంపై కుటుంబంలో భార్య లేదా భర్తకు మరో రుణాన్ని మంజూరు చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు మాత్రమే ఇలా అనుమతిస్తున్నాయి.
ఆర్‌బిఐ కీలక నిబంధనలు…
- బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలకు నష్టం కలిగిస్తోందనే ఉద్దేశంతోనే బంగారు రుణాలను రెన్యువల్ చేయడంపై ఆర్బీఐ నిషేధం విధించింది. తాకట్టులో ఉన్న బంగారంపై పాతరుణాన్ని తీర్చడానికి కొత్త రుణాలను మంజూరు చేయడాన్ని ఆర్బీఐ నిషేధించింది.
- బంగారు రుణాలను ఎందుకు తీసుకుంటున్నారో రుణగ్రహీతకు బ్యాంకులకు వెల్లడించాల్సి ఉంటుంది.
- వ్యవసాయం కోసం జారీ చేసే లక్ష రుపాయలకు మించిన బంగారు రుణాలకు భూమి పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం కోసమే రుణం తీసుకుంటున్నట్టు రుజువు చేయల్సి ఉంటుంది.
- మార్గదర్శకాలను పాటించని బ్యాంకులపై భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుందని ఆర్‌బిఐ బ్యాంకులను హెచ్చరించింది.
సంబంధిత కథనం