గోల్డ్, సిల్వర్ లోన్‌ తీసుకునేవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలతో బెనిఫిట్స్.. ఈ మార్పులను తెలుసుకోండి!-rbi new gold and silver loan regulations to protect borrowers must know these things before taking loan ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  గోల్డ్, సిల్వర్ లోన్‌ తీసుకునేవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలతో బెనిఫిట్స్.. ఈ మార్పులను తెలుసుకోండి!

గోల్డ్, సిల్వర్ లోన్‌ తీసుకునేవారికి ఆర్బీఐ కొత్త నిబంధనలతో బెనిఫిట్స్.. ఈ మార్పులను తెలుసుకోండి!

Anand Sai HT Telugu

రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా బంగారం, సిల్వర్ రుణాలకు నియమాలను అమలు చేయనుంది. ఇది రుణగ్రహీతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త నియమాలు ఏంటి? ప్రయోజనాలు ఏంటి?

ఆర్బీఐ కొత్త నిబంధనలు (Photo: Pixabay)

బంగారం, వెండిపై రుణాలకు రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం బంగారం, వెండి రుణాలు తీసుకునే వారికి బ్యాంకులకు సంబంధించి కొత్త నియమాలు వచ్చాయి. ఆర్బీఐ కొత్త బంగారు రుణ నియమాలు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తాయి. బంగారం, వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారు 8 కీలక మార్పుల గురించి తెలుసుకోవడం కచ్చితంగా అవసరం

చిన్న రుణాలకు అధిక ఎల్టీవీ

బంగారం రుణగ్రహీతలకు ఇప్పుడు బంగారం విలువలో 85 శాతం రుణం ఇస్తారు. ఇది గతంలో 75 శాతం నుండి పెంచారు. ఈ కొత్త లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) పరిమితి వడ్డీతో సహా రూ. 2.5 లక్షల వరకు రుణాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు మీ బంగారం రూ. 1 లక్ష విలువైనది అయితే మీరు ఇప్పుడు గరిష్టంగా రూ. 85,000 రుణం పొందవచ్చు. గతంలో అదే బంగారం కోసం రూ. 75,000 రుణం ఇచ్చేవారు.

2.5 లక్షల లోపు బంగారు రుణాలు

2.5 లక్షల కంటే తక్కువ ఉన్న బంగారు రుణాలకు బ్యాంకులు వివరణాత్మక ఆదాయ ధృవీకరణ లేదా క్రెడిట్ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం లేదు. తక్కువ ఆదాయం ఉన్న రుణగ్రహీతలు, గ్రామీణ ప్రాంతాల వారు బంగారు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడం దీని లక్ష్యం.

ఈ పరిమితి

తాకట్టు పెట్టే బంగారు ఆభరణాలు గరిష్టంగా 1 కిలోకు మంచి ఉండరాదు. బంగారు నాణేలు గరిష్టంగా 50 గ్రాములు ఉండాలి. వెండి ఆభరణాలు గరిష్టంగా 10 కిలోలకు మించరాదు. వెండి నాణేలు గరిష్టంగా 500 గ్రాములు ఉండాలి. ఈ పరిమితి ప్రతి రుణగ్రహీతకు, బ్యాంకుల అన్ని శాఖలకు వర్తిస్తుంది.

అదే రోజు ఇవ్వాలి

బ్యాంకులు బంగారం లేదా వెండి తాకట్టు పెట్టి రుణాలు ఇస్తే.. రుణం ముగిసిన రోజున ఆభరణాలు/నాణేలను తిరిగి ఇవ్వాలి. కొన్ని కారణాలతో ఆలస్యం అయితే వారంలోపు ఇవ్వాలి. అంతకు మించి ఆలస్యం అయితే కస్టమర్‌కు ప్రతి రోజుకు రూ. 5,000 పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

పూర్త పరిహారం

డిపాజిట్ చేసిన బంగారం లేదా వెండి ఆడిట్ లేదా రిటర్న్ సమయంలో దెబ్బతిన్నట్లు తేలితే, బ్యాంకులు స్వయంగా యజమానికి పూర్తి పరిహారం ఇవ్వాలి.

వేలం విషయం

రుణం చెల్లించకపోతే, బకాయి ఉన్నట్లయితే బంగారం వేలం వేసేటప్పుడు బ్యాంకులు ముందుగా తగిన నోటీసు ఇవ్వాలి. రిజర్వ్ ధర మార్కెట్ విలువలో కనీసం 90 శాతం ఉండాలి. వేలంలో లోన్ కంటే ఎక్కువ మెుత్తం వస్తే ఆ ఎక్కువ మెుత్తం ఎలా చెల్లిస్తారో కూడా రాయిల. వేలంలో అందుకున్న అదనపు డబ్బును 7 పని దినాలలోపు రుణగ్రహీతకు తిరిగి ఇవ్వాలి.

ప్రాంతీయ భాష

బంగారం/వెండి రుణ నిబంధనలు, మూల్యాంకన వివరాలను రుణగ్రహీత ఇష్టపడే లేదా ప్రాంతీయ భాషలో పంచుకోవాలి. నిరక్షరాస్యులైన రుణగ్రహీతలకు స్వతంత్ర సాక్షి సమక్షంలో సమాచారం అందించాలి. ఈ కొత్త ఆర్బీఐ నియమాలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. దీనికి ముందు తీసుకున్న బంగారు రుణాలకు ప్రస్తుత నియమాలు వర్తిస్తాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.