RBI MPC meeting : దేశ ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్ల కోత షురూ..
RBI rate cuts : భారత ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది! చాలా కాలంగా అధికంగా ఉన్న వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లను కట్ చేసింది.
బడ్జెట్ 2025 అనంతరం మధ్యతరగతి ప్రజలకు మరో గుడ్ న్యూస్! చాలా కాలంగా అధిక స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను కట్ చేస్తున్నట్టు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేసినట్టు మానిటరీ పాలసీ సమావేశంలో అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
“మా టార్గెట్స్కి తగ్గట్టుగానే ద్రవ్యోల్బణం ఉంది. అందుకే ఈసారి వడ్డీ రేట్లను కట్ చేసేందుకు ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించారు,” అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఆర్బీఐ వడ్డీ రేట్లను కట్ చేయడం దాదాపు 5ఏళ్లల్లో ఇదే తొలిసారి. తాజా కట్‌తో రెపో రేటు 6.5శాతం నుంచి 6.25శాతానికి దిగొచ్చింది. అంతకుముందు వరసుగా 11 ఎంపీసీ సమావేశాల్లో వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచింది.
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ రూ. 12లక్షల ఆదాయంపై సున్నా ట్యాక్స్‌ని ఈ బడ్జెట్ 2025లో భాగంగా నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లలో కోత విధించడంతో మధ్యతరగతి ప్రజలకు మరింత ఊరట లభించినట్టు అయ్యింది.
రేపో రేటు అంటే ఏంటి?
వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి పూచీకత్తుపై వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ మొనేటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వివిధ ఆర్థిక సూచికలను అంచనా వేయడం ద్వారా రెపో రేటును నిర్ణయిస్తుంది. ఎంపీసీలో ఆర్బీఐ గవర్నర్ సహా ఆరుగురు సభ్యులు ఉంటారు.
రెపో రేట్లు తగ్గితే, బయట ప్రజలకు ఇచ్చే లోన్ల వడ్డీలను వివిధ బ్యాంక్‌లు తగ్గిస్తాయి. తద్వారా ప్రజలు తమ జేబుల్లో నుంచి తక్కువ ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. ఫలితంగా సేవింగ్స్ పెరుగుతాయి లేదా ఇతర వాటిపై ప్రజలు ఖర్చు చేస్తారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026 ఆర్థిక సంవత్సరం)లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సూచికలపై ఎంపీసీ సభ్యుల అధిక దృష్టిసారించి.. రేట్ కట్వైపే మొగ్గుచూపారు.
అంచనాలు తగ్గట్టుగానే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ప్రకటన ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
వడ్డీ రేట్ల కోతపై భారీ అంచనాలు..
ఈసారి ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత కచ్చితంగా ఉంటుందని మార్కెట్లో అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. కనీసం 25 బేసిస్ పాయింట్ల రెపో రేటు కోత ఉంటుందని, తద్వారా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 6.25 శాతానికి తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి తగ్గడం.. వడ్డీ రేట్ల కోతపై అంచనాలు పెంచేశాయి. వరుసగా ఏడు త్రైమాసికాల్లో ఇదే అత్యంత మందగమనం!
అదే సమయంలో, 2024 డిసెంబర్లో ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 5.22 శాతానికి తగ్గడంతో రేట్ల కోతకు పరిస్థితులు మరింత అనుకూలంగా మారాయి. 2024 అక్టోబర్‌లో ఇది 14 నెలల గరిష్ఠ స్థాయి (6.2 శాతం) వద్ద ఉండేది.
సంబంధిత కథనం