ఆర్బీఐ కీలక నిర్ణయం: వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఒక ఆశ్చర్యకరమైన చర్యతో శుక్రవారం, జూన్ 6న అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించింది. వడ్డీ రేట్లు అరశాతం తగ్గనున్న నేపథ్యంలో రుణ గ్రహీతలకు ఈఎంఐల భారం తగ్గనుంది.
ఇది వరుసగా మూడోసారి కోత కావడం గమనార్హం. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) విధాన రేటును 5.50 శాతానికి తగ్గించింది.
నేటి కోతతో కలిపి, ప్రపంచ వాణిజ్య యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి 2025లో ఆర్‌బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లను మొత్తం 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరిలో పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గింపుతో ఇది ప్రారంభమైంది, ఇది మే 2020 తర్వాత మొదటి కోత. ఏప్రిల్‌లో కూడా ఇదే స్థాయిలో తగ్గించింది.