Telugu News  /  Business  /  Rbi Hikes Monetary Policy Repo Rate Today 30th September 2022
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ (PTI)

RBI repo rate: మళ్లీ పెరిగిన వడ్డీ రేట్లు.. మరో అరశాతం పెంపు

30 September 2022, 10:08 ISTPraveen Kumar Lenkala
30 September 2022, 10:08 IST

RBI monetary policy repo rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును మరో 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచింది. రెపో రేటు పెంపు మే నెల నుంచి ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

RBI monetary policy repo rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 5.90 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ బుధవారం ప్రారంభమై రెండు రోజులపాటు కొనసాగింది. కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఉదయం ప్రకటించారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ (CPI) ద్రవ్యోల్బణం అంచనా ఇదివరకు చెప్పినట్టుగానే 6.7% గా కొనసాగుతుందని తెలిపారు.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) బ్యాంక్ రేట్లు రెపో రేటు పెంపు తర్వాత 5.65% నుండి 6.15%కి సర్దుబాటు అయ్యాయి. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు వరుసగా 5.65%, 6.15%కి పెరిగాయి.

వివిధ దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న చర్యలకు అనుగుణంగా, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్‌బీఐ కూడా మరో 50 బేసిస్ పాయింట్ల రేటు పెంచుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దానికి అనుగుణంగానే ఆర్‌బీఐ అర శాతం మేర రెపో రేటు పెంచుతూ 5.90 శాతానికి చేర్చింది.

మే నెలలో ఆకస్మికంగా జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సిఫార్సుల ఆధారంగా ఆర్‌బీఐ రెపో రుణ రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. తర్వాత జూన్, ఆగస్టు మాసాల్లో ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుతూ వచ్చింది.

మే నుండి రెపో రేటు 140 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచగా.. ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతంగా ఉంది. తాజా పెంపుతో 5.90 శాతానికి చేరింది.

రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడిన వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) మేలో మోడరేషన్ సంకేతాలను చూపడం ప్రారంభించింది. ఆగస్టులో మళ్లీ 7 శాతానికి చేరుకుంది. ఆర్‌బీఐ తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని రూపొందించేటప్పుడు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన టార్గెట్ పరిధిని 3-3.25 శాతానికి తీసుకువెళ్లేందుకు 75 బీపీఎస్ పాయింట్లను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు యూకే, ఈయూ సెంట్రల్ బ్యాంకులు కూడా రేట్ల పెంపునకు మొగ్గు చూపాయి.

రెపో రేటు ఎందుకు పెంచుతారు?

రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి రుణాలు తెచ్చుకున్నప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రేటు. ఈ రెపో రేటు పెరుగుదల కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతాయి. అంతిమంగా వినియోగదారులకు రుణ భారం పెరుగుతుంది. అంటే చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. తద్వారా మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది. అధిక ధరలు దిగి వచ్చి ద్రవ్యోల్భణ రేటు తగ్గుతుంది. అయితే ఈ పరిణామాల కారణంగా ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక వృద్ధి పెరుగుదలను, ద్రవ్యోల్భణం తగ్గుదలను గమనంలోకి తీసుకుంటూ మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లను పెంచడం తగ్గించడం చేస్తుంటుంది.

భారతదేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7%కి పెరిగింది. ఆహార ధరల పెరుగుదల వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆర్‌బీఐ నిర్దేశించిన 2-6% టార్గెట్ బ్యాండ్ కంటే ఎక్కువగా ఉంది.