Razer Edge 5G। ప్రపంచంలోనే మొట్టమొదటి 5G గేమింగ్ కన్సోల్ లాంచ్, ఫీచర్లు అదుర్స్!
రేజర్ అనే అమెరికా కంపెనీ గేమింగ్ ప్రియుల కోసం, సౌకర్యవంతమైన గేమింగ్ అనుభూతినిచ్చే Razer Edge 5G డివైజ్ లాంచ్ చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 5G గేమింగ్ పరికరం. దీని ధర, ఫీచర్లు చూడండి.
గేమింగ్ హార్డ్‌వేర్‌కు ప్రసిద్ధిగాంచిన అమెరికాకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రేజర్, తాజాగా Razer Edge 5G పేరుతో ఒక కొత్త గేమింగ్ కన్సోల్‌ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 5G గేమింగ్ పరికరంగా చెబుతున్నారు. ఇదొక స్విచ్-స్టైల్ ఆండ్రాయిడ్ పరికరం, అంటే రెండు భాగాలుగా వచ్చింది. మొదటిది డిస్‌ప్లే, అంతర్గత హార్డ్‌వేర్‌తో కూడిన ప్రధాన యూనిట్ కాగా, రెండోది Xbox గేమ్‌ల కోసం Kishi V2 Pro అనే వేరు చేయగలిగే కంట్రోలర్. వినియోగదారులు AAA గేమింగ్ కోసం మైక్రోస్విచ్ బటన్లు, అనలాగ్ ట్రిగ్గర్లు, ప్రోగ్రామబుల్ మాక్రోలు, రేజర్ హైపర్‌సెన్స్ హాప్టిక్‌లతో కూడిన Razer Kishi V2 Proని ఉపయోగించ్చు.
Razer Edge 5G ప్రధాన యూనిట్ విషయానికి వస్తే, ఇందులో మెరుగైన రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED ప్యానెల్, గేమింగ్ పరికరాల కోసం అంకితమైన స్నాప్‌డ్రాగన్ G3X Gen 1 చిప్‌సెట్, డ్యూయల్ స్పీకర్లు, మైక్రోఫోన్‌లు, కెమెరాలు, 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 2TB వరకు విస్తరించుకోగలిగే మైక్రో SD కార్డ్ స్లాట్ వంటి ఫీచర్లనీ ఉన్నాయి. ఆన్ లైన్ మొబైల్ గేమ్స్ ఆడటం అంటే ఇష్టపడేవారికి Razer Edge 5G మంచి జోడి అవుతుంది.
ఇంకా హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ కన్సోల్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది, అదేంటో కూడా చర్చించుకుందాం.
Razer Edge 5G గేమింగ్ కన్సోల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే (2,400x1080 రిజల్యూషన్)
- 8 GB LPDDR5 RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ G3X Gen 1 ప్రాసెసర్
- ముందు భాగంలో 5MP కెమెరా
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం
- ధర, సుమారు రూ. 41,200/-
2023 జనవరి నుంచి మార్కెట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
ఇక, Razer Edge 5Gలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే, ఇదేమి స్మార్ట్‌ఫోన్ కాదు. Razer Edge 5G అనేది స్మార్ట్ ఫీచర్లు కలిగిన ఒక గేమింగ్ డివైజ్ మాత్రమే. దీనిని ఫోన్‌లాగా ఉపయోగించలేము. మొబైల్ గేమ్స్ ఆడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి చెల్లించే ధరతో మంచి బ్రాండ్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత కథనం