Ratan Tata: ఎవరీ మోహినీ మోహన్ దత్తా..? రతన్ టాటా వీలునామాలో రూ. 500 కోట్ల సంపదకు వారసత్వం
Ratan Tata will: గత సంవత్సరం పరమపదించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వీలునామా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీలునామాను ఇటీవలనే ఓపెన్ చేశారు. కుటుంబ సభ్యుడు కాని ఒక వ్యక్తికి తన సంపదలో నుంచి రూ. 500 కోట్లు ఇవ్వాలని రతన్ టాటా ఆ వీలునామాలో కోరారు.

Ratan Tata will: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వీలునామాను ఇటీవల బహిరంగ పర్చారు. అందులో తన కుటుంబానికి చెందని ఒక వ్యక్తికి రూ. 500 కోట్ల సంపద అందించాలని ఉంది. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరా వ్యక్తి? ఆ వ్యక్తికి రతన్ టాటాకు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. సోషల్ మీడియాలో కూడా ఆ వ్యక్తి గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున వెతకడం ప్రారంభించారు.
ఎవరీ మోహిని మోహన్ దత్తా?
రతన్ టాటా తన వీలునామాలో రూ. 500 కోట్లకు వారసుడిగా ప్రకటించింది మోహిని మోహన్ దత్తా (Mohini Mohan Datta) అనే వ్యక్తికి. మోహిని మోహన్ దత్తాది జంషెడ్ పూర్. అతడు కొన్ని దశాబ్దాలుగా రతన్ టాటాకు సన్నిహితుడు. మోహిని మోహన్ దత్తా స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీకి సహ యజమానిగా ఉన్నారు. ఇది తరువాత టాటా యాజమాన్యంలోని తాజ్ సర్వీసెస్ విభాగం కింద తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో భాగం అయింది. అయితే, మోహిని మోహన్ దత్తా చాలా మందికి తెలియదు. కానీ రతన్ టాటాకు మాత్రం సన్నిహితుడు.
రతన్ టాటాతో ఎప్పటి నుంచి పరిచయం?
2013లో తాజ్ సర్వీసెస్ లో విలీనమైన స్టాలియన్ లో మోహిని మోహన్ దత్తా, ఆయన కుటుంబానికి 80 శాతం వాటా ఉంది. స్టాలియన్ లో టాటా ఇండస్ట్రీస్ కు మిగిలిన 20 శాతం వాటా ఉంది. అంతేకాకుండా, దత్తా టిసి ట్రావెల్ సర్వీసెస్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. రతన్ టాటా అత్యంత సన్నిహిత వర్గాలలో దత్తా ఒకరు. 2024 అక్టోబర్ లో టాటా అంత్యక్రియల సందర్భంగా దత్తా మీడియాతో మాట్లాడుతూ తమిద్దరికి 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రతన్ టాటాను జంషెడ్ పూర్ లోని డీలర్స్ హోటల్లో కలిశానని, అప్పటి నుంచి 60 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసునని చెప్పారు. 2024 డిసెంబర్లో ఎన్సీపీఏలో జరిగిన రతన్ టాటా జయంతి వేడుకల్లో కూడా దత్తా పాల్గొన్నారు. దత్తా కుమార్తెల్లో ఒకరు తాజ్ హోటల్స్ లో, ఆ తర్వాత టాటా ట్రస్ట్స్ లో తొమ్మిదేళ్ల పాటు 2024 వరకు పనిచేశారు.
వీలునామాపై మోహిని మోహన్ దత్తా స్పందన
రతన్ టాటా తనకు రూ. 500 సంపద ఇవ్వాలని వీలునామా రాయడంపై మోహిని మోహన్ దత్తా ఇంతవరకు స్పందించలేదు. రతన్ టాటా వీలునామాను అమలు చేసే బాధ్యతలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు షిరీన్, డీనా జెజీభోయ్, సన్నిహిత మిత్రుడు డారియస్ ఖంబాటా, మెల్హి మిస్త్రీ కూడా మీడియా ప్రశ్నలకు స్పందించలేదని సమాచారం.
రతన్ టాటా విల్ ఏం చెబుతుంది?
రతన్ టాటా వీలునామా ప్రకారం, రతన్ టాటా మిగిలిన ఆస్తులలో మూడింట ఒక వంతు దత్తాకు చెందాలి. దీని విలువ రూ .500 కోట్లు మించవచ్చని ఎకనమిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ప్రొబేట్ చేయించుకుని హైకోర్టు ధ్రువీకరించిన తర్వాతే వీలునామా ను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
రతన్ టాటా ఆస్తుల విలువ
రతన్ టాటా మరణానికి ముందు, వారసత్వాలను పంపిణీ చేయడానికి రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్, రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. రతన్ టాటాకు టాటా సన్స్ లో నేరుగా 0.83 శాతం వాటా ఉంది. ఇది సుమారు రూ .8,000 కోట్లు ఉంటుంది. వివిధ స్టార్టప్ లలో వాటాలు, ఆర్ ఎన్ టీ అసోసియేట్స్ లో రూ.186 కోట్ల పెట్టుబడులు, పెయింటింగ్స్ తో సహా ఖరీదైన ఆర్ట్ వర్క్, మసెరటి కార్లు వంటి లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ వద్ద వాల్యుయేషన్ ఇంకా పూర్తి కానందున రతన్ టాటా మొత్తం నికర విలువ ఇంకా అస్పష్టంగా ఉందని ఈటీ నివేదిక తెలిపింది.