సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. అనేక రంగాల స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. వాటిల్లో ఒకటి రైల్‌టెల్ స్టాక్. నేటి ట్రేడింగ్ సెషన్లో ఈ రైల్‌టెల్ షేర్లు ఒకానొక దశలో 9శాతానికిపైగా లాభపడ్డాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి దాదాపు 6శాతం జంప్‌తో రూ. 328 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్ లాభాలకు కారణం ఏంటంటే..
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.25 కోట్లకు పైగా విలువైన ఆర్డర్ వచ్చిందని కంపెనీ చెప్పడంతో రైల్‌టెల్ షేరు ధర సోమవారం లాభాల్లో కొనసాగుతోంది.
"రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ .25,15,24,500 /- (పన్ను మినహాయించి)కు వర్క్ ఆర్డర్ పొందింది," అని కంపెనీ మార్చ్ 23న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది.
ఇది ఇప్పటికే ఉన్న ఎంపీఎల్ఎస్ / ఐఎల్ఎల్ లింక్‌ల పునరుద్ధరణకు 5 సంవత్సరాల రేట్ కాంట్రాక్ట్, సాధ్యాసాధ్యాల నిర్ధారణకు లోబడి 5 సంవత్సరాల వ్యవధిలో వచ్చే ప్రతిపాదిత కొత్త కనెక్షన్లకు ఇది రేటు ఒప్పందం అని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఇప్పటికే ఎంపీఎల్ఎస్/ఐఎల్ఎల్ లింక్‌ల రెన్యువల్‌తో పాటు రానున్న 5ఏళ్లల్లో అదనపు కనెక్షన్లు ప్రతిపాదిస్తే, వాటిని కూడా ఈ రేట్ కాంట్రాక్ట్ చేస్తుంది.
2025 ఏప్రిల్ 01 నుంచి 2030 మార్చి 31 వరకు ఆర్డర్ లేదా కాంట్రాక్ట్ అమలు చేయాల్సి ఉంటుంది.
రూ.16,89,38,002 (పన్నుతో సహా) విలువైన ఓఎఫ్సీ లేయింగ్ పనులకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వర్క్ ఆర్డర్ అందుకున్నట్లు మార్చి 20న రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
మరోవైపు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డు మార్చ్ 12న పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ లో 10% చొప్పున ఈక్విటీ షేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
రైల్‌టెల్ డివిడెండ్ రికార్డ్ తేదీ 2 ఏప్రిల్ 2025, బుధవారం. డివిడెండ్ చెల్లింపు తేదీ 9 ఏప్రిల్ 2025.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో రైల్‌టెల్ స్టాక్ 9శాతానికిపైగా లాభపడి 339.40 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అనంతరం రూ. 328 వద్దకు చేరింది. ఈ రైల్‌టెల్ షేరు ధర ఒక వారంలో 22.5% పెరిగింది. ఒక నెలలో 10% వృద్ధిని సాధించింది. స్మాల్‌క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ ఏడాది (వైటీడీ) ప్రాతిపదికన 16.5 శాతం పడిపోగా.. ఆరు నెలల్లో 27 శాతం పతనమైంది. ఏడాది కాలంలో రైల్‌టెల్ షేర్లు 6 శాతం నష్టపోయింది.
అయితే, రైల్‌టెల్ షేర్లు దీర్ఘకాలంలో మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. ఈ పీఎస్‌యూ స్టాక్ రెండేళ్లలో 240 శాతం, మూడేళ్లలో 278 శాతం వృద్ధిచెందింది.
సంబంధిత కథనం