ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్న పోర్షే మకాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. 590 కి.మీ రేంజ్, లగ్జరీ ఫీచర్లు!
Porsche Macan EV : పోర్షే మకాన్ ఈవీ భారత్ మెుబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించనుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన పలు వివరాలు వెల్లడయ్యాయి.
పోర్షే మకాన్ ఈవీ 2025 జనవరి 17న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025లో భారతదేశంలో ప్రీమియర్ కానుంది. మకాన్ ఈవీ ఇంతకు ముందు భారతదేశంలో రూ .1.65 కోట్ల ఎక్స్-షోరూమ్ వద్ద లాంచ్ చేశారు. పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీ స్టాండర్డ్ మోడ్‌లో సుమారుగా 576 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే లాంచ్ కంట్రోల్‌ను ఓవర్ బూస్ట్‌తో ఎనేబుల్ చేస్తే పనితీరును 630 బీహెచ్‌పీ, 1,130 ఎన్ఎమ్ టార్క్ వరకు పెంచుకోవచ్చు.
భారతదేశంలో మకాన్ స్టాండర్డ్ ఆర్‌డబ్ల్యూడీ, 4 ఎస్ వేరియంట్లలో లభిస్తుంది. మకాన్ టర్బో 4ఎస్ కేవలం 3.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అత్యంత ఖరీదైన 4ఎస్‌లో పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్ మెంట్(PASM) ఎలక్ట్రానిక్ డంపింగ్ కంట్రోల్ కూడా ఉంటుంది. లెవలింగ్ సిస్టమ్, ఎత్తు సర్దుబాటుతో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఉంది. పోర్షే టార్క్ వెక్టరింగ్ ప్లస్(పీటీవీ ప్లస్), వెనుక యాక్సిల్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఆటో ఎక్స్ పోలో ప్రీమియర్ పోర్షే మకాన్ ఈవీని తీసుకురానున్నారు. మకాన్ టర్బో ఎలక్ట్రిక్ 100 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఈ ఎస్‌యూవీ ప్రీమియం ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిక్ (పీపీఈ)పై ఆధారపడి ఉంటుంది. 270 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి కేవలం 21 నిమిషాల్లో 10 నుండి 80 శాతం ఛార్జ్ చేయవచ్చని తయారీదారులు పేర్కొన్నారు. ఇందులో అందించే కంబైన్డ్ డబ్ల్యూఎల్‌టీపీ రేంజ్ 518-590 కిలో మీటర్లు. అర్బన్ డబ్ల్యూఎల్‌టీపీ రేంజ్ 670-762 కిలోమీటర్లు రేంజ్ ఇస్తుంది.
ఇది నాలుగు ఎల్ఈడీ ఎలిమెంట్లను పొందుతుంది. ప్రధాన హెడ్ ల్యాంప్ సెటప్ బంపర్ దగ్గర ఉంటుంది. వెనుక భాగంలో కూపే లాంటి డిజైన్ ఉంది. కొత్త సెట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇవి మంచి డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంటుంది. అంతేకాదు.. కస్టమర్ మూడు స్క్రీన్ల వరకు పొందవచ్చు. 12.6-అంగుళాల కర్వ్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ కోసం ఆప్షనల్ 10.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుంది.
పోర్షే ఇండియా 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరిగే 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మకాన్ టర్బో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్ట్ డ్రైవ్లను అందించనున్నట్లు గతంలో ప్రకటించింది. 'మాక్కాన్ థ్రిల్ డ్రైవ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జనవరి 19 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టెస్ట్ డ్రైవ్ ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అందిస్తారు. రిజిస్టర్ చేసుకోవడానికి వినియోగదారులు కంపెనీ వెబ్ పేజీలోకి లాగిన్ అయ్యి స్లాట్, ఇతర వివరాలను ఎంచుకోవాలి.