PMV Electric EaS-E ev car: సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కార్..
PMV Electric EaS-E ev car: పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ అత్యంత చౌకయిన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.
ముంబైకి చెందిన పీఎంవీ ఎలక్ట్రిక్ కంపెనీ బుధవారం భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. EaS-E పేరుతో ఉన్న ఈ కారు మోడల్ ధర రూ. 4.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). EaS-E దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వాహనంగా నిలుస్తోంది.
EaS-E కారు రోజువారీ ఉపయోగానికి వీలుండే పూర్తి ఎలక్ట్రిక్ స్మార్ట్ కారు అని పీఎంవీ ఎలక్ట్రిక్ పేర్కొంది. ‘EaS-E పూర్తిగా ఎలక్ట్రిక్ 2 సీటర్ స్మార్ట్ మైక్రోకార్. ఇది స్థిరమైన రవాణా, గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ సమస్యలకు ఒక పరిష్కారాన్ని అందిస్తుంది’ అని కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ కారు నాలుగు గంటల కంటే తక్కువ వ్యవధిలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేస్తుంది. EaS-E మోడల్ కారు మూడు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
ఆసక్తి ఉన్న కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ నుండి రూ. 2,000 చెల్లించి ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు.
ఇది గరిష్టంగా 13 హెచ్‌పి శక్తిని, 50 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను కలిగి ఉందని హెచ్‌టి ఆటో నివేదించింది. EaS-E మోడల్ ఎలక్ట్రిక్ కార్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. కాగా కేవలం ఐదు సెకన్లలోపు గంటకు 40 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
రిమోట్ కీలెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్, డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎయిర్ కండిషనింగ్, ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయని నివేదిక పేర్కొంది. Eas-Eకి ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీదారులు లేరు.