Penny Stock : దూసుకెళ్లిన రెండు రూపాయల పెన్నీ స్టాక్.. ఆ కంపెనీ నుంచి మెగా ఆర్డర్
Stock Market : ఇటీవలి కాలంలో కొన్ని పెన్సీ స్టాక్స్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. తాజాగా ఇషాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మంగళవారం ట్రేడింగ్‌లో దృష్టి సారించింది. కంపెనీ షేరు నేడు 4 శాతం వరకు పెరిగింది.
ఎన్ఎస్ఈ లిస్టెడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇషాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మంగళవారం ట్రేడింగ్‌లో అందరి దృష్టి ఆకర్శించింది. కంపెనీ షేరు నేడు 4 శాతం వరకు పెరిగింది. ఇషాన్ ఇంటర్నేషనల్ షేరు ఇంట్రాడేలో రూ.2.95 వద్ద గరిష్టాన్ని తాకింది. సోమవారం ఈ షేరు 4 శాతం పెరిగింది. షేర్లలో ఈ ర్యాలీ వెనుక పెద్ద ఆర్డర్ ఉంది. వాస్తవానికి ఇషాన్ ఇంటర్నేషనల్‌కు సెన్సెక్స్ హెవీ వెయిట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) నుండి ఆర్డర్ వచ్చింది. ముకేశ్ అంబానీ కంపెనీ నుంచి ఆర్డర్ రావడంతో ఈ స్టాక్ లో విపరీతమైన కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
ఆర్ఐఎల్ నుంచి రూ.60 కోట్ల విలువైన ఆర్డర్‌ను ఇషాన్ కంపెనీ దక్కించుకుంది. గత ఏడాది స్మాల్ క్యాప్ కంపెనీ ఆదాయం రూ.35 కోట్లు. దీనితో పోలిస్తే ఆర్ఐఎల్ ఆర్డర్ దాదాపు రెట్టింపుగా ఉంది. ఆర్ఐఎల్ ఆర్డర్ అందుకున్న విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు కంపెనీ తెలిపింది.
నిర్మాణ సామగ్రి సరఫరా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి ఇషాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గణనీయమైన ఆర్డర్‌ను పొందిందని వెల్లడించింది. రాబోయే త్రైమాసికాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఇలాంటి మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామని పేర్కొంది. పన్నులతో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్డర్ పరిమాణం రూ .60 కోట్లు అని ఇషాన్ లిమిటెడ్ చెప్పుకొచ్చింది. దీంతో స్టాక్ ధర ఒక్కసారిగా పెరిగింది.
ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవమ్ ఉత్థాన్ మహాభియాన్ యోజన (పీఎం-కుసుమ్) పథకం కింద వ్యవసాయ సబ్‌మెర్సిబుల్ పంపుల సరఫరా, ఇన్‌స్టాలేషన్, కమిషనింగ్, నిర్వహణ కోసం ఇషాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇటీవల రైట్ వాటర్ సొల్యూషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ పంపులు సౌరశక్తితో పనిచేయడానికి, డీజిల్, గ్రిడ్ విద్యుత్తుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, రైతులకు నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి రూపొందించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చాంద్వాడ్, నిఫాడ్ తాలూకాల్లో 20 సౌరశక్తితో నడిచే సబ్‌మెర్సిబుల్ పంపులను ఏర్పాటు చేశారు.