Vijay Shekhar Sharma : ‘నా బిడ్డకు యాక్సిడెంట్ అయ్యింది- ఐసీయూలో ఉంది’.. పేటీఎంపై విజయ్ శేఖర్ భావోద్వేగం!
సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సంస్థ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ. తన బిడ్డ ఐసీయూలో ఉందని భావోద్వగంగా మాట్లాడారు.
పేటీఎం సంక్షోభంపై భావోద్వగ ప్రసంగం చేశారు సంస్థ ఫౌండర్, ఎండీ విజయ్ శేకర్ శర్మ. పేటీఎంని తన కూతురిగా భావించినట్టు చెప్పారు. తన బిడ్డకు యాక్సిడెంట్ అయ్యి, ఇప్పుడు ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారు.
దిల్లీలో జరిగిన జేఐఐఎఫ్ ఫౌండేషన్ డే ఈవెంట్లో పాల్గొన్నారు విజయ్ శేఖర్. ఈ నేపథ్యంలో పేటీఎం గురించి మాట్లాడారు.
"పేటీఎం కంపెనీ నా కూతురు లాంటింది. మేము కలిసి ఎదిగాము. లాభాల బాటలో పరిగెత్తాము. ఫ్రీ క్యాష్‌ని జనరేట్ చేశాము. జీవితంలో ముఖ్యమైన ఎంట్రెన్స్ టెస్ట్‌కి నా బిడ్డ సిద్ధమవుతున్నట్టు భావించాను. కానీ నా కూతురుకు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు ఐసీయూలో ఉంది," అని పేటీఎం సీఈఓ అన్నారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను నియంత్రిస్తూ ఫిబ్రవరిలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. కేవైసీ నిబంధనలు పాటించడం లేదని, మనీ లాండరింగ్ జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తూ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిలిపివేసింది. ఇది పేటీఎం ఉన్న వన్ 97 కమ్యూనికేషన్ కంపెనీకి గట్టి షాక్ ఇచ్చింది! కంపెనీ లాభాలు అమాంతం పడిపోయాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటి నుంచి పేటీఎం సంస్థపై ఒత్తిడి మరింత పెరిగింది.
కంపెనీ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని, గత కొంతకాలంలో పలు కీలక పాఠాలను నేర్చుకున్నానని విజయ్ శేఖర్ తెలిపారు.
"ప్రొఫెషనల్ లెవల్స్‌లో చూస్తే, మేము ఇంకా మెరుగైన ప్రదర్శన చేసి ఉండాల్సింది. ఇందులో సీక్రెట్ ఏం లేదు. పరిస్థితులను మేము ముందే సరిగ్గా అర్థం చేసుకుని ఉండాల్సింది. మా మీద ఉంచిన బాధ్యతలను నెరవేర్చి ఉండాల్సింది. పాఠాలు నేర్చుకున్నాము," అని పేటీఎం ఫౌండర్ చెప్పుకొచ్చారు.
పేటీఎం పేరెంట్ కంపెనీ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్, ఎఫ్వై23 క్యూ4లో రూ. 23,99 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దాని కన్నా ముందు త్రైమాసికంతో (రూ. 2,465 కోట్లు) పోల్చుకుంటే తక్కువ. ఇక సంస్థ నష్టాలు రూ. 168 కోట్ల నుంచి రూ. 551 కోట్లకు పెరిగింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో పెట్టుబడులను రైటాఫ్ చేయడం ఇందుకు ప్రధాన కారణం.
ఈ పూర్తి వ్యవహారం పేటీఎం షేర్హోల్డర్లకు నష్టాలనే మిగిల్చింది. వాస్తవానికి పేటీఎం స్టాక్, ఇన్వెస్టర్లను ఎప్పుడు బాధపెడుతూనే వచ్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. అక్కడి నుంచి పడుతూ, పడుతూ, పేటీఎం సంక్షోభం కారణంగా ఇప్పుడు రూ. 500 దిగువను ట్రేడ్ అవుతున్నాయి.
పేటీఎం షేర్ ప్రైజ్ హిస్టరీ..
నవంబర్ 2021లో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన పేటీఎం స్టాక్ రూ. 1783 వద్ద గరిష్ఠాన్ని నమొదు చేసింది. వాస్తవానికి ఈ ఐపీ ప్రైజ్ బ్యాండ్ రూ. 2వేల కన్నా ఎక్కువే! ఇక ఏడాది కాలంలో పేటీఎం షేర్లు దాదాపు 49శాతం పతనమయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 33శాతం నష్టాలను చూశాయి. నెల రోజుల్లో మాత్రం 15శాతం మేర పెరిగాయి. ఐదు రోజుల్లో దాదాపు 8శాతం వృద్ధి చెందాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి పేటీఎం షేర్లు రూ. 438 వద్ద కొనసాగుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్