పేటీఎం గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూపీఐ చెల్లింపులతో పెద్ద మార్పును తీసుకొచ్చింది. అయితే తాజాగా మరో విషయంతో ముందుకు వచ్చింది. వ్యాపారుల కోసం దేశంలో మొట్టమొదటి సౌరశక్తితో పనిచేసే చెల్లింపు సౌండ్ బాక్స్‌ను ప్రారంభించింది. ఆవిష్కరణలో ఒక అడుగు ముందుకువేసింది. ఇది పగటిపూట సాధారణ సూర్యకాంతిలో ఛార్జ్ అవుతుంది. విద్యుత్ ఛార్జ్ లేదా కనెక్షన్ అవసరం లేకుండా దీనిని వాడుకోవచ్చు. చిన్న వీధి వ్యాపారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.
పేటీఎం భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే చెల్లింపు సౌండ్‌బాక్స్‌ను ప్రారంభించింది. వ్యాపారులు ఇప్పుడు క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి చెల్లింపులను అంగీకరించవచ్చు. దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఈ సౌండ్‌బాక్స్‌లో అంతర్నిర్మిత సోలార్ ప్యానెల్ ఉంది. ఇది తక్కువ కాంతిలో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఒకటి సౌరశక్తితో, మరొకటి విద్యుత్తుతో నడుస్తుంది. పగటిపూట 2-3 గంటలు సూర్యకాంతిలో ఛార్జ్ చేస్తే, దానిని రోజంతా వాడేసుకోవచ్చు.
ఈ సోలార్ సౌండ్‌బాక్స్ ఎలక్ట్రిక్ బ్యాటరీ 10 రోజుల పాటు ఉంటుంది. 3 వాట్ స్పీకర్ ద్వారా తక్షణ ఆడియో చెల్లింపు సౌండ్ మీకు వినిపిస్తుంది. ఈ సౌండ్‌బాక్స్ 11 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ లావాదేవీల కోసం 4జీ కనెక్టివిటీని అందిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, వీధి వ్యాపారులు, వ్యాపారవేత్తలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండనుంది. విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది డిజిటల్ చెల్లింపులను సులభతరంగా చేయనుంది. చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడానికి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక అడుగు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. పేటీఎం టెక్నాలజీ ఆధారిత సేవలకు కట్టుబడి ఉందని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.
సంబంధిత కథనం