Oyo Discount : ఓయో డిస్కౌంట్ కోడ్ గురించి అడిగిన షాది.కామ్ ఓనర్.. స్పాన్సర్ చేయాలన్న నెటిజన్!
Oyo Discount : ఓయోలో కొత్త రూల్స్ మార్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనిపై తెగ మీమ్స్ వైరల్అవుతున్నాయి. తాజాగా షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా దీనిపై స్పందించారు.
కొన్ని రోజుల నుంచి ఓయో రూమ్స్ గురించి చర్చ ఎక్కువగా ఉంది. ఎందుకంటే పెళ్లికాని జంటలు ఓయోకు రావడంపై కంపెనీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మీరట్‌లో పెళ్లికాని జంటల ప్రవేశాన్ని ఓయో నిషేధించినప్పటి నుండి ఈ వార్త బాగా వైరల్ అయింది. తర్వాత కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది. ఇప్పుడు షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా దీనిపై స్పందించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్‌ను ట్యాగ్ చేస్తూ ఓయో డిస్కౌంట్ కోడ్ గురించి మాట్లాడారు. షాదీ.కామ్‌కు ఓయో ప్రత్యేక తగ్గింపు కోడ్ ఉంటుందన్నట్టుగా పోస్ట్ చేస్తూ.. ఏమంటారు? రితేష్ అగార్వాల్ అని ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది వినియోగదారుల స్పందనలపై అనుపమ్ మిట్టల్ కూడా స్పందించారు.
కొందరు వినూత్న డిస్కౌంట్ కోడ్‌లను ప్రతిపాదించారు. కొంతమంది వినియోగదారులు హనీమూన్ ప్యాకేజీలకు లాటరీ ఆధారిత బహుమతులు తీయాలని సూచించారు. షాదీ.కామ్ ద్వారా కలుసుకున్న జంటలకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వాలని ఫన్నీగా రిప్లై ఇచ్చారు. మరికొందరేమో.. ప్రత్యేకమైన ఆఫర్‌ల కోసం Shaadi.com, Oyo కలిసి పని చేయాలని చెప్పారు. షాదీ.కామ్ ద్వారా పెళ్లి చేసుకున్న కొత్త జంటకు ఓయోలో హనీమూన్ కోసం మొదటి రెండు రాత్రులకు స్పాన్సర్ చేయగలరా అని ఒకరు కామెంట్ చేశారు. దీనిపై మిట్టల్ స్పందిస్తూ.. లాటరీ ద్వారా ప్రతి నెలా కొంతమందికి ఈ బహుమతి అందిస్తామని ఫన్నీగా సమాధానమిచ్చారు.
అయితే దీనిపై ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ కూడా స్పందించారు. భాగస్వామిని కలిగి ఉండే ఏ విషయాన్నైనా ప్రొత్సహించొచ్చు అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. గొప్ప సూచన అంటూ పోస్ట్ చేశారు. దీనిపై కూడా నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. దిగ్గజ వ్యాపార వెత్తలు ఫన్నీగా మాట్లాడుకోవడం చూసి చాలా మంది సరదాగా ఫీలయ్యారు.
ఓయో కొత్త రూల్ ఏంటి?
ఓయో ఇటీవల తన చెక్-ఇన్ విధానాన్ని మార్చింది. దీని ప్రకారం పెళ్లికాని జంటలను ఓయో గదిలోకి అనుమతించరు. ఓయో రూమ్‌కి జంట రావాలనుకుంటే.. వారి సంబంధానికి సంబంధించిన రుజువును అందించాలి. వివాహిత జంటలు లేదా కుటుంబ సభ్యులు మాత్రమే ప్రవేశం పొందుతారు. నిబంధనలు పాటించని హోటళ్లపై చర్యలు తీసుకుంటామని ఓయో తెలిపింది. ప్రస్తుతం మీరట్‌లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. త్వరలో ఇతర నగరాల్లో కూడా వీటిని ప్రారంభించవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది. ఈ మేరకు అధికారికంగా కొత్త రూల్స్ ప్రకటించింది.