Google Chrome extensions: ఈ ఎక్స్ టెన్షన్స్ తో చాలా డేంజర్; వెంటనే డిలీట్ చేయండి
కొన్ని ప్రమాదకర గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్స్ (Google Chrome extensions) ను యాంటీవైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ అవస్త్ (Avast) గుర్తించింది. ఇప్పటికే సుమారు 7.5 కోట్ల మంది వినియోగదారులు వాటి బారిన పడ్డారని వెల్లడించింది.
సాధారణంగా ఎక్స్ టెన్షన్స్ వెబ్ బ్రౌజర్స్ పని తీరును మరింత మెరుగుపరుస్తాయి. అయితే, అన్ని ఎక్స్ టెన్షన్స్ తో ఉపయోగాలే ఉండవు. కొన్ని ఎక్స్ టెన్షన్స్ వల్ల ఇబ్బందులు కూడా తప్పవు. ముఖ్యంగా యూజర్ల వెబ్ సెర్చ్ వివరాలను దొంగలించే ఎక్స్ టెన్షన్లతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సైబర్ నేరస్తులు ఈ ఎక్స్ టెన్షన్ల ద్వారా మన వెబ్ సెర్చ్ వివరాలను దొంగలిస్తున్నారు. క్రోమ్ వెబ్ స్టోర్ లోని కొన్ని ప్రమాదకర ఎక్స్ టెన్షన్స్ గురించి తాజాగా యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ అవస్త్ (Avast) వెల్లడించింది. అవి మన సిస్టమ్ లోకి యాడ్ వేర్ లను పంపించడం, సెర్చ్ రిజల్ట్ ను తారుమారు చేయడం చేస్తుంటాయి.
పీడీఎఫ్ టూల్ బాక్స్ ఎక్స్ టెన్షన్..
క్రోమ్ వెబ్ స్టోర్ లో ఉన్న పీడీఎఫ్ టూల్ బాక్స్ ఎక్స్ టెన్షన్ (PDF Toolbox extension) ఎంత ప్రమాదకరమైనదో.. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వ్లాదిమిర్ పాలంట్ ఇటీవల వివరించారు. ఇలాంటి ప్రమాదకర ఎక్స్ టెన్షన్స్ క్రోమ్ వెబ్ స్టోర్ లో సుమారు 32 వరకు ఉన్నాయని అవస్త్ వెల్లడించింది. వాటిని ఇప్పటికే సుమారు 7.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది. వీటిలో యాడ్ బ్లాకర్స్, డౌన్ లోడర్స్, బ్రౌజర్ థీమ్స్, రికార్డర్స్, ట్యాబ్ మేనేజర్స్ .. మొదలైన ఎక్స్ టెన్షన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా, ఇప్పటికవే సుమారు 50 ప్రమాదకర ఎక్స్ టెన్షన్స్ ను ఇప్పటికే క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి తొలగించారు.
ప్రమాదకర లింక్స్
ఈ ఎక్స్ టెన్షన్స్ మొదట్లో ఉపయోగకరంగా, ఎలాంటి ముప్పు లేని వాటిగా కనిపిస్తాయి. అయితే, వాటిలో దాగిఉన్న ప్రమాద కర కోడ్ తోనే ముప్పు ఉంటుంది. ఈ ఎక్స్ టెన్షన్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ మనం వెబ్ లో సెర్చ్ చేసే విషయాల గురించి తెలుసుకుంటాయి. దాంతో, కుప్పలు తెప్పలుగా ఆ సెర్చెస్ కు సంబంధించిన యాడ్స్ ను పంపిస్తాయి. అలాగే, సెర్చ్ రిజల్ట్ ను తారుమారు చేయడం, పెయిడ్ యాడ్స్ ను, స్పాన్సర్డ్ లింక్స్, డేంజరస్ లింక్స్ ను పంపించడం చేస్తుంటారు. అయితే, ఈ డేంజరస్ ఎక్స్ టెన్షన్స్ ను చాలావరకు గూగుల్ తొలగించివేస్తుంది.