Oppo Smartphones: ఒప్పో 5జీ ఫోన్ వాడుతున్నారా.. 5జీ అప్‍డేట్‍పై కంపెనీ కీలక ప్రకటన
Oppo Phones 5G Update: తమ 5జీ మోడల్స్ అన్నీ జియో స్టాండలోన్ 5జీకి సపోర్ట్ చేస్తాయని ఒప్పో వెల్లడించింది. ఇప్పటికే చాలా మోడళ్లకు 5జీ ఎనేబుల్ అప్‍డేట్ విడుదల చేసింది. పూర్తి వివరాలివే..
Oppo Phones 5G Update: దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. 5జీ నెట్‍వర్క్ ను గత నెలలో లాంచ్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సహా మొత్తంగా ఎనిమిది నగరాల్లో జియో ట్రూ 5జీ నెట్‍వర్క్ (Jio 5G Network) అందుబాటులో ఉంది. 5జీ రోల్అవుట్ అయినప్పటి నుంచి 5జీ ఫోన్‍లలో ఈ నెట్‍వర్క్ ను ఎనేబుల్ చేసేందుకు కంపెనీలు అప్‍డేట్లు ఇస్తున్నాయి. తాజాగా ఒప్పో కంపెనీ ఈ విషయంపై కీలక ప్రకటన చేసింది. జియో ట్రూ 5జీకి ఒప్పో 5జీ ఫోన్‍లన్నీ సపోర్ట్ చేస్తాయని వెల్లడించింది. ఇప్పటికే దాదాపు చాలా 5జీ మోడళ్లకు అప్‍డేట్‍ను విడుదల చేశామని, మిగిలిన కొన్నింటికి అతిత్వరలో వస్తుందని తెలిపింది. అన్ని ఒప్పో 5జీ స్మార్ట్ ఫోన్లు… జియో స్టాండలోన్ (SA) 5జీకి కూడా సపోర్ట్ చేస్తాయని స్పష్టం చేసింది.
Oppo Smartphones 5G Update: ఈ మోడళ్లకు అప్‍డేట్ వచ్చేసింది
జియో 5జీ సర్వీస్‍లకు సపోర్ట్ చేసేలా కొన్ని మోడళ్లకు ఇప్పటికే ఓటీఏ అప్‍డేట్‌ను ఒప్పో రోల్అవుట్ చేసింది. ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో రెనో 7, ఒప్పో ఎఫ్21 ప్రో, ఒప్పో ఎఫ్19 ప్రో+, ఒప్పో కే10, ఒప్పో ఏ53ఎస్ మొబైళ్లు జియో 5జీకి సపోర్ట్ చేసేలా అప్‍డేట్ వచ్చింది. ఈ అప్‍డేట్ తర్వాత జియో స్టాండలోన్ నెట్‍వర్క్ కు కూడా ఈ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి. మిగిలిన 5జీ మోడళ్లకు కూడా జియో 5జీ స్టాండలోన్‍ను కల్పించే సాఫ్ట్ వేర్ అప్‍డేట్ త్వరలోనే వస్తుందని ఒప్పో పేర్కొంది. ఇందుకోసం జియోతో కలిసి పని చేస్తున్నామని తెలిపింది.
సాధారణంగా నాన్-స్టాండలోన్ (NSA) 5జీ కంటే స్టాండలోన్ (SA) 5జీ మెరుగ్గా ఉంటుంది. దాదాపు చాలా 5జీ స్మార్ట్ ఫోన్‍లలో SA 5జీ బ్యాండ్లు కూడా ఉంటాయి. 4జీ టవర్స్, ఇన్‍ఫ్రాస్ట్రక్చర్‍తోనే టెలికం సంస్థలు 5జీ సర్వీస్‍లను కల్పిస్తే అది నాన్ స్టాండలోన్ (NSA 5G). మొత్తం అధునాతన 5జీ టవర్స్, మౌలిక సదుపాయాల ద్వారా అందించే 5జీ నెట్‍వర్క్ ను స్టాండలోన్ (5G SA)గా పరిగణిస్తారు.
Jio 5G: హైదరాబాద్‍లోనూ జియో 5జీ
హైదరాబాద్‍లో ఇటీవలే జియో 5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోనూ రోల్అవుట్ అయింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 8 నగరాల్లో జియో 5జీ సర్వీస్‍లు ఉన్నాయి. హైదరాబాద్‍తో పాటు ముంబై, ఢిల్లీ, కోల్‍కతా, చెన్నై, వారణాసి, బెంగళూరుల్లో జియో 5జీ అందుబాటులో ఉంది. మరోవైపు, హైదరాబాద్ సహా మొత్తం 8 నగరాల్లో ఎయిర్ టెల్ కూడా 5జీ నెట్‍వర్క్ ను అందిస్తోంది.