OYO new rules : పెళ్లైన వారికే రూమ్స్.. ఓయో కొత్త రూల్స్! ఇక వారికి నో ఎంట్రీ..!
భాగస్వామ్య హోటళ్లల్లో చెక్-ఇన్ రూల్స్‌ని ఓయో సవరించింది! తాజా రూల్స్ ప్రకారం.. అవివాహితులకు ఓయో రూమ్స్‌లోకి ఎంట్రీ ఉండదు! పెళ్లైన వారు, సంబంధిత ప్రూఫ్‌లు చూపించి చెక్-ఇన్ చేయాల్సి ఉంటుంది.
ప్రముఖ హోటల్ బుకింగ్ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది! తన భాగస్వామ్య హోటళ్ల చెక్- ఇన్ రూల్స్‌ని సవరించింది. తాజా రూల్స్ ప్రకారం.. అవివాహిత జంటలు ఇకపై రూమ్స్‌లో చెక్ ఇన్ చేయలేరు.
ఓయోలో వారికి ఇక నో ఎంట్రీ..!
ఓయో కొత్త రూల్స్ ప్రకారం.. బుకింగ్‌లు చేయాలనుకునే జంటలందరూ చెక్-ఇన్ సమయంలో తమ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన ప్రూఫ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. స్థానిక సామాజిక సెన్సిబులిటీకి అనుగుణంగా.. బుకింగ్స్‌ని ఆమోదించాలా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయాన్ని భాగస్వామ్య హోటళ్లకు వదిలేస్తున్నట్టు ఓయో తెలిపింది.
అయితే ఈ కొత్త నిబంధన మొదట ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కి వర్తిస్తుంది. ఈ గైడ్‌లైన్స్ వెంటనే మీరట్‌లోని ఓయో భాగస్వామ్య హోటళ్లపై ప్రభావం చూపనున్నాయి. గ్రౌండ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరిన్ని నగరాలకు ఈ పాలసీని విస్తరించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.
“పెళ్లి కాని వారికి ఓయో హోటల్స్‌లో రూమ్స్ ఇవ్వొద్దని దేశవ్యాప్తంగా చాలా నగరాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. వీటిల్లో మీరట్‌కి చెందినవే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము,” అని ఓయో ఒక ప్రకటనలో తెలిపింది.
ఓయో హోటల్స్‌పై ఇప్పటివరకు ఎవైనా చెడు అభిప్రాయాలు ఉంటే వాటిని మార్చేందుకు, కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపారం, మతపరమైన, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన అనుభవాలను అందించే బ్రాండ్‌గా సంస్థను నిలిపేందుకు ఈ చర్యలు పనిచేస్తాయని భావిస్తున్నారు. ఎక్కువ కాలం బస చేయడం, పదేపదే బుకింగ్స్ చేసుకోవడాన్ని ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యమని కంపెనీ తెలిపింది.
హోటళ్లను బ్లాక్ లిస్టులో పెట్టడం..
కస్టమర్స్ అనుభవాన్నిదృష్టిలో పెట్టుకుని భాగస్వామ్య హోటళ్లు, పోలీసులతో కూడిన సురక్షిత ఆతిథ్యంపై సంయుక్త సెమినార్లతో సహా దేశవ్యాప్తంగా ఓయో అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా అనైతిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న హోటళ్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు ఓయో బ్రాండింగ్‌ని అనధికారికంగా ఉపయోగించుకుంటున్న హోటళ్లపై చర్యలు తీసుకుంటోంది.
“సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య విధానాలను కొనసాగించడానికి ఓయో కట్టుబడి ఉంది. మేము వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తున్నాము. మేము పనిచేసే సూక్ష్మ మార్కెట్లలో చట్టాలు, పౌర సమాజ సమూహాల అభిప్రాయాలు వినడం, అందుకు తగ్గట్టు పనిచేయడం మా బాధ్యత. దాన్ని కూడా మేము గుర్తిస్తాము. ఈ విధానాన్ని, దాని ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటాం,” అని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ తెలిపారు.
సంబంధిత కథనం