OnePlus sales: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ సహా ఇతర వన్ ప్లస్ ప్రొడక్ట్స్ అమ్మకాలు నిలిచిపోనున్నాయా?
OnePlus sales: మే 1, 2024 నుంచి వన్ ప్లస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తామని మొబైల్ రిటైలర్ల సంఘం (ORA) హెచ్చరించింది. ప్రాఫిట్ మార్జిన్ తో పాటు అమ్మకాల అనంతర సేవల విషయంలో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఓఆర్ఏ ఈ నిర్ణయం తీసుకుంది.
OnePlus sales: వన్ ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4) స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ అయిన వారం రోజులకే కంపెనీ ఉత్పత్తులు రిటైల్ మార్కెట్లో అమ్మకానికి నోచుకోని ప్రమాదం ఏర్పడింది. అపరిష్కృత సమస్యల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ భారతదేశ మొబైల్ రిటైలర్ల సంఘం (South India Organised Retailers Association ORA) వెల్లడించింది. ‘‘మీ కంపెనీతో ఈ సమస్యలను పరిష్కరించడానికి మేము నిరంతరం ప్రయత్నించినప్పటికీ, పరిష్కారం లభించలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.అందువల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది’’ అని వన్ ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్ కు రాసిన లేఖలో ఓఆర్ఏ తెలియజేసింది. వన్ ప్లస్ ఉత్పత్తుల అమ్మకాలను మే 1 నుంచి నిలిపివేయాలని సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ORA) హెచ్చరించింది.
మార్జిన్స్ చాలా తక్కువ
వన్ ప్లస్ ఉత్పత్తులపై మొబైల్ రిటైలర్లు నిరంతరం తక్కువ లాభాల మార్జిన్లను బుక్ చేసుకోవాల్సి వస్తోందని, పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల మధ్య వ్యాపారాలను కొనసాగించడం సవాలుగా మారిందని ఓఆర్ఏ (ORA) తెలిపింది. మరోవైపు, వన్ ప్లస్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన కస్టమర్ల నుంచి నిరంతరం ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించింది. వారంటీ, సర్వీస్ క్లెయిమ్ ల ప్రాసెసింగ్ లో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోందని, దాంతో, కస్టమర్ల నుంచి తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించింది.
వన్ ప్లస్ దే బాధ్యత
ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత వన్ ప్లస్ దేనని రిటైలర్ల సంఘం (ORA) స్పష్టం చేసింది. ప్రస్తుతం బాల్ వన్ ప్లస్ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించింది. ప్రధానంగా ప్రాఫిట్ మార్జిన్లను పెంచడంతో పాటు కస్టమర్ల ఫిర్యాదులకు సాధ్యమైనంత త్వరగా స్పందించాలని ఓఆర్ఏ (ORA) కోరుతోంది. ఓఆర్ఏ అనేది దక్షిణ భారతదేశంలోని వాణిజ్య రిటైలర్ల సంస్థ.