భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 1000కిపైగా మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించాలని యోచిస్తోందని సమాచారం. ఎక్కువ లాభాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ లేఆఫ్స్ వార్తల మధ్య సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ నూతన 52- వీక్ కనిష్ఠ స్థాయిని తాకింది.
ఈ ఈవీ తయారీ సంస్థ గత ఏడాది దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది. కాగా సంస్థ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నారన్న తాజా వార్తలపై ఓలా ఎలక్ట్రిక్ ఇంకా స్పందించలేదు.
గత ఏడాది ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఓలా ఎలక్ట్రిక్కి కాస్త గడ్డుకాలమే నడుస్తోందని చెప్పాలి. గత నెలలో 25,000 యూనిట్లను విక్రయించడంతో ప్రస్తుతం అమ్మకాలు మందగించాయి. అదే సమయంలో ఇతర ఆటోమొబైల్ సంస్థల నుంచి పోటీ తీవ్రంగా పెరిగిపోయింది.
ఇన్ని ప్రతికూలతల మధ్య ఓలా ఎలక్ట్రిక్కి ఉన్న సానుకూల విషయం.. దాని మార్కెట్ షేరు! అమ్మకాలు తగ్గినా, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఈ సంస్థ ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతంది. ప్రస్తుతం 28 శాతం మార్కెట్ వాటాను నిలుపుకోగలిగింది.
పలు నివేదికల ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ తన ఉద్యోగులను తొలగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రొక్యూర్మెంట్, ఫుల్ఫిల్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాక్చర్ సహా అనేక విభాగాల్లో వర్కర్లు తాజా లేఆఫ్తో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. షోరూమ్లు, సర్వీస్ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ సేల్స్, సర్వీస్, వేర్హౌస్ సిబ్బందిని సైతం ఓలా తొలగిస్తుంది. లాజిస్టిక్స్ అండ్ డెలివరీ వ్యూహాన్ని పునరుద్ధరించడానికి, ఖర్చులను తగ్గించడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
గతేడాది నవంబర్లో సాఫ్ట్బ్యాంక్కి చెందిన ఈవీ తయారీ సంస్థ ఉద్యోగాల్లో కోత విధించింది. గత ఏడాది చివరి నాటికి, ఓలా ఎలక్ట్రిక్ 3,824 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇది 2023తో పోలిస్తే దాదాపు రెండు శాతం తక్కువ అని మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ట్రాక్సన్ నివేదిక తెలిపింది.
గత ఏడాది లాంచ్ అయినప్పటి నుంచి ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అమ్మకాల మందగమనంతో పాటు, ఓలా ఎలక్ట్రిక్ అధిక ఖర్చులు, తక్కువ టర్నోవర్ వంటి సమస్యలతో సంస్థ పోరాడుతోంది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తూనే ఉంది. 2021 ఆగస్టులో ఈ విభాగంలోకి ప్రవేశించినా, నాలుగు సంవత్సరాల నుంచి లాభదాయకంగా మారలేదు.
మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓలా ఎలక్ట్రిక్ షేరు దాదాపు 3.5శాతం పతనమై రూ. 54.7 వద్ద ట్రేడ్ అవుతోంది.
సంబంధిత కథనం