OLA Electric IPO Listing : లాభాల్లేవ్- నష్టాల్లేవ్.. ఫ్లాట్‌గా ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ లిస్టింగ్
OLA Electric IPO Listing price : ఓలా ఎలక్ట్రిక్ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లిస్ట్ అయ్యాయి. రూ. 76 వద్ద ఓపెన్ అయ్యాయి. పూర్తి వివరాలు..
మంచి బజ్‌తో స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యింది. ఓలా ఎలక్ట్రిక్ షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవ్వగా.. బీఎస్ఈ సెన్సెక్స్‌లో రూ. 75.99 వద్ద , ఎన్ఎస్ఈ నిఫ్టీలో వద్ద రూ. 76 వద్ద ఓపెన్ అయ్యాయి. ఇది ఐపీఓ సమయంలో నిర్ణయించిన అప్పర్ బ్యాండ్‌తో సమానం.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకి మిశ్రమ స్పందన లభించిందని దాని సబ్స్క్రిప్షన్ స్టేటస్‌ని చూసినప్పుడే అర్థమైంది. మార్కెట్ అంచనాల కంటే తక్కువగా ఈ ఐపీఓ సబ్‌స్క్రైబ్ అయ్యిందని స్టాక్ మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు జపాన్ వడ్డీ రేట్ల పెంపు, అమెరికాలో మాంద్యం భయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు సైతం ఒత్తిడిలో ఉన్నాయి. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓలో ఫ్లాట్ టు డిస్కౌంట్ లిస్టింగ్ ఉండవచ్చని నిపుణులు ముందే అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ లిస్టింగ్ రోజు ఉదయం గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) డిస్కౌంట్లో కనిపించింది. చివరికి ఓపెనింగ్ మాత్రం ఫ్లాట్‌గా జరిగింది. ఫలితంగా మదుపర్లకు అటు లాభాలు, ఇటు నష్టాలు కలగలేదు.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ వివరాలు..
రూ.6,145.56 కోట్ల విలువైన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ మొత్తం 4.45 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఇష్యూలో 198.17 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి.
రిటైల్ కేటగిరీలో 4.05 సార్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ (క్యూఐబీ) కేటగిరీలో 5.53 సార్లు, నాన్- ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ ఐఐ) కేటగిరీలో 2.51 సార్లు పబ్లిక్ ఇష్యూ సబ్‌స్క్రైబ్ అయింది.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్టు 2, శుక్రవారం పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్ అయ్యింది. ఆగస్టు 6 మంగళవారంతో సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ముగిసింది. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అలాట్మెంట్ గురువారం జరిగింది.
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్‌ని ఒక్కో షేరుకు రూ.72 నుంచి రూ.76గా నిర్ణయించారు. రూ.5,500 కోట్ల విలువైన 72.37 కోట్ల ఈక్విటీ షేర్లు, రూ.645.56 కోట్ల విలువైన 8.49 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కాంపొనెంట్ కలిపి బుక్ బిల్ట్ ఇష్యూ ద్వారా రూ.6,145.56 కోట్లు సమీకరించింది.
కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, యాక్సిస్ క్యాపిటల్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, గోల్డ్మన్ శాక్స్ (ఇండియా) సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓలో లీడ్ మేనేజర్లుగా ఉండగా, లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ రిజిస్ట్రార్‌గా వ్యవహరించింది.
ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ప్లేయర్. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ- సేల్స్ సహా, ఈవీ భాగాల కోసం టెక్నాలజీ అభివృద్ధి తయారీ సామర్థ్యాలను నిర్మిస్తోంది. 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్‌కి పెద్ద మార్కెట్ షేరు కూడా ఉంది.
సంబంధిత కథనం