Ola Maps : ఇకపై ఓలా మ్యాప్స్.. గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పిన ఓలా.. ఏడాదికి ఎంత ఇచ్చేవారంటే
Ola Maps : ఈ కాలంలో గూగుల్ మ్యాప్స్ లేకుండా వెళ్లలేని పరిస్థితిలోకి వచ్చారు జనాలు. దీనిపైనే ర్యాపిడో, ఓలా లాంటి సంస్థలు కూడా ఆధారపడుతున్నాయి. కానీ గూగుల్ మ్యాప్స్‌కు గుడ్ బై చెప్పినట్టుగా చెప్రారు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్.
గూగుల్ మ్యాప్స్ లేకుండా వీధి చివరకు కూడా వెళ్లలేని వారు చాలా మంది ఉన్నారు. ఒక్క క్లిక్ చేసి అడ్రస్ పెట్టేసి.. తర్వాత దాన్ని ఫాలో అవుతూ వెళ్లడమే. నేరుగా లొకేషన్‌లోకి తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్స్. అయితే ర్యాపిడో, ఓలా లాంటి సంస్థలు కూడా వీటినే ఉపయోగిస్తున్నాయి. కస్టమర్లను సరైన గమ్యస్థానానికి తీసుకెళ్తున్నాయి. గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేసి కావాల్సిన ప్రదేశానికి వెళ్లవచ్చు. ఈ విధానం ఓలా క్యాబ్స్ లాంటి రైడింగ్ అందించే కంపెనీలకు ఈజీగా ఉండేది. అయితే ఇకపై గూగుల్ మ్యాప్స్ సేవలను వినియోగించుకోమని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.
గూగుల్ మ్యాప్స్‌కు బదులుగా ఓలా క్యాబ్స్ తన స్వంత అంతర్గత ఓలా మ్యాప్‌లను ఉపయోగిస్తుందని ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ఈ ప్రక్రియలో కంపెనీ రూ. 100 కోట్లు ఆదా చేస్తుందని తెలిపారు. ఎందుకంటే ఏడాదికి వంద కోట్లు గూగుల్ మ్యాప్స్ కోసం ఓలా ఖర్చు చేస్తుంది. ఇకపై ఈ ఖర్చు ఉండదని భవిష్ చెప్పుకొచ్చారు.
'గత నెలలో మైక్రోసాఫ్ట్ Azure నిష్క్రమణ తర్వాత, మేం ఇప్పుడు Google Maps నుండి పూర్తిగా నిష్క్రమించాం. సంవత్సరానికి రూ.100 కోట్లు దీనికోసం ఖర్చు చేసేవాళ్ళం. కానీ మా అంతర్గత Ola మ్యాప్స్‌కి పూర్తిగా మారడం ద్వారా ఈ నెలలో నుంచి సున్నా ఖర్చు ఉంటుంది. ఒక్కసారి మీ Ola యాప్‌ని చెక్ చేసి.. అవసరమైతే అప్‌డేట్ చేయండి.' ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
ఓలా మ్యాప్స్‌ను కస్టమర్లు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్ట్రీట్ వ్యూ, ఇండోర్ ఇమేజెస్, త్రీడీ మ్యాప్స్, డ్రోన్ మ్యాప్స్ లాంటి తదితర ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకీ రానున్నాయి.
మైక్రోసాఫ్ట్ అజూర్ నుంచి కొంతకాలం కిందటే ఓలా వైదొలిగింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్, అజూర్‌ను ఉపయోగించడం నుంచి బయటకు వచ్చేసింది. క్రుట్రిమ్ క్లౌడ్ అనే దాని స్వంత అంతర్గత క్లౌడ్ స్టోరేజ్‌ని ఉపయోగించడం మెుదలుపెట్టింది. తాజాగా Google మ్యాప్స్ నుండి నిష్క్రమించాలని Ola నిర్ణయం తీసుకుంది.
అయితే ఓలా నిర్ణయాలు చూస్తుంటే.. థర్డ్ పార్టీ మీద ఆధారపడి ముందుకు వెళ్లకూడదని అనుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. సొంత వ్యవస్థను రూపొందించుకునేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని అర్థమవుతుంది. ఈ రెండు నిర్ణయాలతో Ola ఒక కంపెనీగా మరింత స్వతంత్రంగా మారడానికి, సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. ఇది కాకుండా ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సాలిడ్-స్టేట్ బ్యాటరీలపై పెట్టుబడి పెడుతోంది. వచ్చే ఏడాది వాటిని ఉపయోగించాలని యోచిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ సాలిడ్-స్టేట్ బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి తన ప్రయత్నాలను ముందుకు తీసుకువెళుతోంది. వచ్చే ఏడాది నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఈ బ్యాటరీలనే ఉపయోగించనున్నారు.