Charger Money Refund : ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జర్ కోసం విడిగా డబ్బులు చెల్లిస్తే వెంటనే రీఫండ్ క్లెయిమ్ చేసుకోండి
EV Charger Money Refund : మీరు మార్చి 2023కి ముందు ఏథర్, ఓలా, టీవీఎస్, హీరో నుండి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేశారా? ఛార్జర్ కోసం విడిగా డబ్బులు చెల్లించారా? అయితే దాన్ని తిరిగి పొందవచ్చు.

మార్చి 2023కి ముందు ఓలా, ఏథర్, టీవీఎస్, హీరో ఈవీ స్కూటర్‌ని కొనుగోలు చేసి ఉంటే మీకు ఛార్జర్ డబ్బులు రీఫండ్ వస్తాయి. అది ఎలా అంటే ఛార్జర్ కోసం విడిగా డబ్బులు చెల్లించి ఉండాలి. కంపెనీ మీకు ఛార్జర్ కోసం డబ్బును తిరిగి ఇస్తుంది. మీరు ఛార్జర్ డబ్బుల రీఫండ్‌కు అర్హులు. ఈ పథకాన్ని జూన్ 2023 నుండి ప్రారంభించారు. ఇది ఏప్రిల్ 2025 వరకు చెల్లుతుంది. దీని కోసం మీరు కొన్ని దశలను అనుసరించాలి. దీని ద్వారా మీరు కంపెనీ నుండి ఛార్జర్ డబ్బును వాపసు పొందవచ్చు.
వివరాలు అందించాలి
మీ ఎలక్ట్రిక్ స్కూటర్ బిల్లుతో పాటు కొనుగోలు రుజువును అందించండి. తర్వాత మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్ చేసిన చెక్కు ఉండాలి. ఇ-మెయిల్ పంపడం ద్వారా, షోరూమ్‌ని సందర్శించడం ద్వారా కంపెనీని సంప్రదించండి. రీఫండ్‌లను అభ్యర్థించని కొంతమంది కస్టమర్‌లు ఉన్నందున ఇప్పటికే వారికి మెసేజ్‌లు, ఈ-మెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా వంటి వివిధ ఛానెల్‌ల ద్వారా రిమైండర్‌లను పంపినట్లు వాహన తయారీదారులు చెబుతున్నారు. రీఫండ్ ప్రక్రియను ముగించే చివరి ప్రయత్నంలో భాగంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పబ్లిక్ నోటీసులు జారీ చేయాలని వాహన తయారీదారులను ఆదేశించింది. వాపసు క్లెయిమ్ చేసుకోని వారికి ఈ సమాచారం ఎలాగోలా తెలియజేయాలి.
వెంటనే ప్రారంభించండి
రీఫండ్ ప్రక్రియను ప్రారంభించడానికి కంపెనీ కస్టమర్ కేర్ సెంటర్, డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా సంప్రదించొచ్చు. కంపెనీలు అనేక మాధ్యమాల ద్వారా రీఫండ్ గురించి కస్టమర్లకు తెలియజేశాయి. కానీ ఇంకా రీఫండ్‌ను క్లెయిమ్ చేయకుంటే పైన పేర్కొన్న పద్ధతులను అనుసరించి వీలైనంత త్వరగా వాపసును క్లెయిమ్ చేయండి.
ఛార్జర్ కూడా ఇవ్వాలి
స్కూటర్ ధరలను కాగితంపై చౌకగా కనిపించేలా చేయడం ద్వారా కస్టమర్లను కంపెనీలు ఆకర్శిస్తాయి. కొన్ని కంపెనీలు ఛార్జర్‌ల కోసం విడిగా వసూలు చేయడంలాంటివి చేస్తుంటాయి. ఛార్జర్‌లు ఈవీలకు తప్పనిసరిగా అవసరమైన భాగాలు కాబట్టి.. వాటిని వాహనానికి జతచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యుత్ స్కూటర్ కొనుగోలుదారులకు ఛార్జర్ కూడా ఇవ్వాలి.