Electric Two Wheelers : భారత మార్కెట్‌లోకి రానున్న మరో 4 ఎలక్ట్రిక్ బైకులు.. ప్రారంభ ధర రూ.60,000!
Electric Two Wheelers In India : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఒబెన్ ఎలక్ట్రిక్ కూడా 4 కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది.
భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల్లో ఒకటైన ఒబెన్ ఎలక్ట్రిక్ తన తదుపరి మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒబెన్ ఎలక్ట్రిక్ రాబోయే ఆరు నెలల్లో 4 కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్‌గా, భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని విప్లవాత్మకంగా మార్చడంలో ఒబెన్ ఎలక్ట్రిక్ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రారంభ ధర రూ.60వేలు
రాబోయే కొత్త ఒబెన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలు రూ. 60,000 మొదలుకొని రూ. 1,50,000లోపు ఉంటుంది. ఈ వ్యూహాత్మక చర్యతో అన్ని విభాగాలలో కస్టమర్లను ఆకర్శించనున్నారు. కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా సరసమైన, అధిక-పనితీరు గల ఈవీలను తయారుచేస్తోంది ఒబెన్ ఎలక్ట్రిక్.
ఒబెన్ ఎలక్ట్రిక్ రాబోయే ఈవీ ద్విచక్ర వాహనాలు ఐసీఈ వాహనాల మాదిరిగానే విశ్వసనీయత, పనితీరును అందించడానికి రూపొందిస్తున్నారు. ఇది మొత్తం రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే అదనపు ప్రయోజనాలతో వస్తుందని కంపెనీ తెలిపింది.
కొత్త షోరూమ్‌లు
రాబోయే కొత్త వాహనాలతో పాటు ఒబెన్ ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా తన ఉనికిని విస్తరించనుంది. ఒబెన్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది చివరి నాటికి 12+ ప్రధాన నగరాల్లో 60 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనుంది. ఈ విస్తరణ తర్వా అమ్మకాల పెరుగుదల, సేవా కేంద్రాలకు మెరుగైన యాక్సెస్‌ను అందిస్తుంది.
పెరుగుతున్న కస్టమర్ బేస్‌కు అనుగుణంగా ఒబెన్ ఎలక్ట్రిక్ విస్తరించాలనుకుంటోంది. ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా చొరవతో దేశంలోని ప్రతి మూలకు ఎలక్ట్రిక్ మొబిలిటీని అందుబాటులోకి తీసుకురావడానికి ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రయాణం చేస్తుందని కంపెనీ నమ్మకం వ్యక్తం చేసింది.
తక్కువ ఖర్చుతో వాహనాలు : సీఈఓ
ఒబెన్ ఎలక్ట్రిక్ సీఈఓ మధుమితా అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ సామర్థ్యాన్ని గుర్తించడం చాలా ముఖ్యమని చెప్పారు. సరైన ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలతో మేము ICEల నుండి EVలకు సులభంగా మారవచ్చన్నారు. ఒబెన్ ఎలక్ట్రిక్ కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా ఈవీలను రూపొందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు.
'తక్కువ ఖర్చుతో కూడిన, స్థానికంగా తయారు చేసిన వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. మా కొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మేం ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నాం.'అని ఒబెన్ ఎలక్ట్రిక్ సీఈఓ మధుమితా అగర్వాల్ చెప్పారు.